ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు కోసం నాడు పలువురు రక్త తర్పణం చేశారని, నేడు అదే ప్లాంట్‌ను ప్రయివేటీకరణ బారి నుంచి కాపాడుకునేందుకు కార్మికులు రక్తదానం చేస్తున్నారని ఆంధ్ర మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్, ఎన్‌ఆర్‌ఐ హాస్పిటల్ మెడికల్ డీన్ డాక్టర్ పివి.సుధాకర్ అన్నారు. స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన ఉక్కు నగరంలోని డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కళాక్షేత్రం (సిడబ్ల్యుసి-1)లో ‘స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం రక్తదానం చేద్దాం’ పేరిట శుక్రవారం ఏడో వార్షిక రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పాల్గని మాట్లాడుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ స్టీల్‌ప్లాంట్ అవతరించడానికి ఆనాడు 32 మంది ప్రాణత్యాగం చేశారని, ఆ పోరాట కాలంలో తమ కుటుంబ సభ్యులూ భాగస్వాములయ్యారని గుర్తు చేశారు. నేడు ప్లాంట్‌ను ప్రయివేటీకరణ బారి నుంచి రక్షించుకునేందుకు ఏడు సంవత్సరాలుగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తూ కార్మికులు ముందుకెళ్లడం అభినందనీయమని అన్నారు. ఉక్కు పరిరక్షణకు ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. స్టీల్‌ప్లాంట్ జనరల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలలో రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న స్టీల్ సిఐటియు కార్యకర్తలు ఆదర్శనీయులన్నారు. రక్తదాన శిబిరాన్ని సందర్శించిన వారిలో స్టీల్‌ప్లాంట్ సిఎమ్‌డి అతుల్‌భట్, పలువురు డైరెక్టర్లు, సిఐఎస్‌ఎఫ్ కమాండెంట్ ఆసిఫ్ అహ్మద్, సిపిఎం కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు, ఉక్కు కార్మిక సంఘాల నాయకులు, పలువురు స్టీల్‌ప్లాంట్ ఉన్నతాధికారులు ఉన్నారు. కార్యక్రమంలో స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వైటి.దాస్, యు.రామస్వామి పాల్గొన్నారు.
