- కలెక్టరేట్ వద్ద ఐద్వా ఆధ్వర్యాన రిలే నిరాహారదీక్షలు
ప్రజాశక్తి-పార్వతీపురం : పార్వతీపురం పట్టణ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఐద్వా ఆధ్వర్యాన బుధవారం కలెక్టరేట్ వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు వి ఇందిర, సిఐటియు జిల్లా కార్యదర్శి వై మన్మధరావు, జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిర మాట్లాడుతూ పట్టణంలో ప్రధానమైన తాగునీటి సమస్యను ఏళ్ల తరబడినా పాలకులు పరిష్కరించకపోవడం అన్యాయమని అన్నారు. నాగావళి, జంఝావతి జీవ నదులు చెంతనే ఉన్నప్పటికీ పట్టణ ప్రజలకు తాగునీరు అందివ్వలేని స్థితిలో ప్రభుత్వాలు ఉండటం శోచనీయమన్నారు. మన్మధరావు మాట్లాడుతూ జనాభా అవసరాలకు సరిపడా తాగునీరు, మౌలిక సదుపాయాలు లేక చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అధికారులకు పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపైనా చూపాలని కోరారు. ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి మాట్లాడుతూ ఈ దీక్షలకు పట్టణ ప్రముఖులు, మేధావులు, అభ్యుదయవాదులు సంఘీభావం తెలపాలని కోరారు. అధికారులు స్పందించకపోతే అక్టోబర్ 1న చలో కలెక్టరేట్ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు బి సూరిబాబు, ఐద్వా పట్టణ నాయకులు జి తులసి, ఎం గౌరి, బి జయ్యమ్మ, మాధురి పాడి, పి ఉమా, రావణమ్మ, పలు వార్డుల మహిళలు పాల్గొన్నారు. దీక్షలకు అంగన్‌వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి గంటా జ్యోతిలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి శాంతి కుమారి మద్దతు తెలిపారు.