54 ‘సీమ’ మండలాల్లో కరువు

  • నోటిఫై చేసిన ప్రభుత్వం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాయలసీమలోని 54 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి విడుదల చేసిన ఈ నోటిఫికేషన్‌లో రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో అతి స్వల్ప వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. కేంద్ర వ్యవసాయశాఖ కరువు నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్లు పంపిన నివేదికల (పంట నష్టం 33 శాతం, అంతకంటే ఎక్కువ) ఆధారంగా కరువు మండలాల ప్రకటన చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం ప్రకటించిన 54 మండలాల్లో 27 మండలాల్లో తీవ్ర కరువు, మరో 27 మండలాల్లో మధ్యస్థ కరువు నెలకొన్నట్లు పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో 2, అనంతపురం 7, శ్రీసత్యసాయి 10, అన్నమయ్య 19, చిత్తూరు 16 మండలాల్లో కరువును ప్రకటించా రన్నారు. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ విడుదల చేసిన ప్రకటనలో నైరుతి రుతుపవనాల్లో రాష్ట్ర సాధారణ వర్షపాతం 574.7 మిల్లీమీటర్లు ఉండగా, 681.6 మిల్లీమీటర్లు వర్షపాతం కురిసిందని, అయినప్పటికీ కొన్ని మండలాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం, డ్రైస్పెల్‌ నమోదైందని వివరించారు.

జిల్లాల వారీ కరువు మండలాలు
కర్నూలు : కౌతాళం, పెద్దకడుబూరు
అనంతపురం : నార్పల, అనంతపురం
విడపనకల్లు, యాడికి, గార్లదిన్నె, బికె సముద్రం, రాప్తాడు
శ్రీసత్యసాయి : తాడిమర్రి, ముదిగుబ్బ, తలుపుల, కనగానిపల్లి, ధర్మవరం, నంబులపూలకుంట, గాండ్లపెంట, బుక్కపట్నం, రామగిరి, పరిగి
అన్నమయ్య : గాలివీడు, చిన్నమండె, సంబేపల్లి, టి సుందరపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, వీరబల్లె, తంబళ్లపల్లి, గుర్రం కొండ, కలకాడ పీలేరు, కలికిరి, వాల్మీకీపురం, కురబలకోట, పెద్ద తిప్పసముద్రం, బి కొత్తకోట, మదనపల్లె, నిమ్మనపట్లె
చిత్తూరు : పెనుమూరు, యాదమరి, గుడిపాల, శ్రీరంగరాజపురం, చిత్తూరు, శాంతిపురం, రొంపిచెర్ల, పూతలపట్టు, సోమల, పుంగనూరు, పలమనేరు, బైరెడ్డిపల్లి, వెంకటగిరి కోట, గుడుపల్లె, కుప్పం, రామకుప్పం

➡️