Drugs Case :  సంధ్య ఆక్వా కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు

విశాఖ : విశాఖ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్‌ కేసుపై సిబిఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా తాజాగా … సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని నోటీసుల్లో సిబిఐ పేర్కొంది. మరోవైపు ఎపిలో పలువురు ఆక్వా వ్యాపార ప్రతినిధులను కూడా సిబిఐ అధికారులు ప్రశ్నించనున్నారు. పెద్ద మొత్తంలో ఈస్ట్‌ ఆర్డర్‌ చేసుకోవడంలో ఆంతర్యమేంటనే దానిపై ప్రశ్నలు సంధించనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు.. సిబిఐ అడిగిన ప్రశ్నలకు సంధ్య ఆక్వా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

‘సంధ్యా’ యాజమాన్యంపై సిబిఐ ప్రశ్నల వర్షం
తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్‌లో డ్రగ్స్‌ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణ వేగవంతం చేసింది. ఇటీవల మరికొన్ని బ్యాగుల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్‌ బ్యాగుల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తెలిసింది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సిబిఐ విచారిస్తోంది. ఎప్పటినుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్‌ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్‌ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు ? తదితర విషయాలపై సిబిఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం.

సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్‌ డేటా పై నిఘా…
సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్‌ డేటాపై సిబిఐ దఅష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్‌ కార్యకలాపాలపై కూడా నిఘా పెట్టింది. డ్రగ్‌ కంటైనర్‌ తనిఖీలకు వచ్చిన సిబిఐకి ముందుగా ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్‌ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్‌ల తనిఖీలకు అనుసరించే విధానంపై సిబిఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్‌ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది.

➡️