అండుగంటిన భూగర్భ జలాలు – అప్పులు నష్టాల్లో అన్నదాతలు..!

ప్రజాశక్తి-పుట్లూరు (అనంతపురం) : పుట్లూరు మండలంలో గత సంవత్సరం నుండి వర్షాలు లేకపోవడంతోపాటు హెచ్‌ ఎల్‌ సి నీటిని కూడా విడుదల చేయకపోవడంతో మండల వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో రైతులు పంటలు కాపాడుకోవడం కోసం లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు అప్పు తీసుకువచ్చి వేయి నుంచి 1500 అడుగుల వరకు బోర్లను వేస్తున్నారు కానీ బోర్లలో నుంచి చుక్క నీరు కూడా బయటికి రావడం లేదు. రైతులు తమ పంటలు కాపాడుకోలేక పెట్టుబడి కూడా రాకపోవడంతో పంటలను తొలగిస్తున్నారు. నాగిరెడ్డి పల్లె గ్రామానికి చెందిన నరసింహారెడ్డి తనకున్న మూడున్నర ఎకరా పొలంలో గత 12 సంవత్సరాల నుండి చీని పంటను సాగు చేశారు. డబ్బులు వచ్చే సమయానికి గత సంవత్సరం నుండి వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగుంటాయి. లోపల భూగర్భ జలాలు అడుగంటుకుపోవడంతో బోర్ల నుంచి ఒక చుక్క కూడా నీరు రాకపోవడంతో రెండు బోర్లు వేసి రెండు లక్షల వరకు బోర్ల కోసం ఖర్చు చేశారు దీంతో రైతుకు సుమారు 8 లక్షల వరకు నష్టం వాటిలిందని నరసింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ఆర్థిక సాయం అందించాలని అన్నదాతలు కోరారు.

➡️