- అభ్యర్థులకు నష్టం
- మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించిన డిఎస్‌సిలో ఇంటర్, డిగ్రీ, పిజిలలో వచ్చిన మార్కుల శాతంతో సంబంధం లేకుండా అనుమతినివ్వాలని పిడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో డిఎస్‌సికి ఎస్‌సి, ఎస్‌టి, బిసిలను దూరం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు. డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్నతో కలిసి లక్ష్మణరావు మాట్లాడుతూ.. 16,347 పోస్టులతో డిఎస్‌సి నోటిఫికేషన్‌ను రాష్ట్రప్రభుత్వం విడుదల చేయడాన్ని స్వాగతించారు. నిరుద్యోగులు ఐక్యంగా అనేక పోరాటాలు చేసి ఈ నోటిఫికేషన్‌ను సాధించుకున్నారని చెప్పారు. ఈ నోటిఫికేషన్‌లో లోపాలు ఉన్నాయని, వీటిని తక్షణమే ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్‌సికి దరఖాస్తు చేసుకునే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, వికలాంగ అభ్యర్థులకు డిగ్రీలో 45 శాతం మార్కులు ఉండాలని నిబంధన విధించారని తెలిపారు. డిగ్రీలో 40 శాతం మార్కులతో బిఇడి చేసి, టెట్ రాసిన అభ్యర్థులకు ఇప్పుడు 45 శాతం మార్కులు ఉండాలనే నిబంధన వల్ల నష్టం జరుగుతోందని వివరించారు. బిఇడి, డైట్ చేసి టెట్ అర్హత సాధించిన అభ్యర్థులు ఇప్పుడు ఎందుకు అనర్హులు అయ్యారో చెప్పాలని అన్నారు. ఈ నిబంధనను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, అధికారుల అనాలోచిత విధానాల వల్ల అభ్యర్థులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డిఎస్‌సి పరీక్షలతోపాటే ఎపిపిఎస్‌సి, డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, తదితర పోస్టులకు పరీక్షలు నిర్వహించనుందని వివరించారు. దీంతోపాటు సిలబస్ రీత్యా అభ్యర్థులకు శిక్షణ పొందేందుకు 90 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. ఒకే జిల్లాకు ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏడేళ్లుగా నోటిఫికేషన్ లేదని, కావున అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు సమయంలో అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు ఇచ్చిన వెబ్‌సైట్, టోల్‌ఫ్రీ నెంబర్లు పనిచేయడం లేదన్నారు. ఎడిట్ ఆప్షన్, సబ్జెక్టు ఎంపికలను చూపించడం లేదని వివరించారు. తక్షణమే ఈ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.