ప్రజాశక్తి-నెల్లూరు : తక్షణమే డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలని నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నెల్లూరు విఆర్‌సి సెంటర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆందోళనను భగం చేసేందుకు పోలీసులు ఒకానొక దశలో ప్రయత్నించారు. పోలీసులతో చర్చలనంతరం డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే డిఎస్‌సి ఫైలుపై మొదటి సంతకం చేసి నియామకాలు చేపడతామని చంద్రబాబు హామీ ఇచ్చారని, టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా హామీకి దిక్కులేదన్నారు. అదిగో.. ఇదిగో అంటూ అభ్యర్థులను ఊరిస్తున్నారే తప్ప నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. డిఎస్‌సి నోటిఫికేషన్ కోసం ఏడు సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కోసం చర్యలు చేపట్టాలని, తక్షణమే డిఎస్‌సి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎం.వి రమణ జిల్లా అధ్యక్షులు బి.పి నరసింహ, వినోద్ కుమార్, డిఎస్‌సి అభ్యర్థులు పాల్గొన్నారు.
