- మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు డిమాండ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : డిఎస్‌సి పరీక్షకు ఆన్‌లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని పిడిఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డివైఎఫ్‌ఐ (భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య) ఆధ్వర్యాన విజయవాడ ధర్నా చౌక్‌లో గురువారం నిర్వహించిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఒక జిల్లాకు ఒక పేపర్ మాత్రమే ఉండాలన్నారు. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని, నోటిఫికేషన్ నాటికి కేవలం 45 రోజుల సమయం ఏ మాత్రం సరిపోదని అన్నారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కోరారు. డైట్, బిఇడి చేసి టెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు డిఎస్‌సికి అవకాశం కల్పించాలన్నారు. ఓపెన్ విధానంలో విద్యనభ్యసించిన వారికి డిఎస్‌సిలో అవకాశం కల్పించాలన్నారు. పిఇటి పోస్టుల సంఖ్య పెంచాలని కోరారు. అభ్యర్థుల వినతులను పరిగణలోకి తీసుకుని నోటిఫికేషన్‌లో అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికే డిఎస్‌సి అభ్యర్థులు టెక్నికల్ సమస్య వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, తక్షణమే ప్రభుత్వం, అధికారులు స్పందించి సాంకేతిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు.
డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ.. డిఎస్‌సి నోటిఫికేషన్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి అభ్యర్థులందరికీ న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. డివైఎఫ్‌ఐ ఎన్‌టిఆర్ జిల్లా అధ్యక్షులు పి.కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు, అధిక సంఖ్యలో డిఎస్‌సి అభ్యర్థులు పాల్గొన్నారు.