ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, రైతులకు రూ.6,700 కోట్ల బకాయిలు విడుదల

  • ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు రూ.6,700 కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం తెలిపారని ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ వెల్లడించారు. మంత్రి పయ్యావుల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌తో కలిసి ఆర్థికశాఖపై ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం సమీక్ష నిర్వహించారు. సమావేశం నిర్ణయాలను అనంతరం పయ్యావుల మీడియాకు వెల్లడించారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లులు, అమరావతి రైతులకు కౌలు బకాయిలు మొత్తం రూ.6,700 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారని వెల్లడించారు. జిపిఎఫ్‌ బకాయిలు రూ.519 కోట్లు, పోలీస్‌ సరెండర్‌ లీవ్‌ బకాయిలు రూ.214 కోట్లు, సిపిఎస్‌ బకాయిలు రూ.300 కోట్లు, టిడిఎస్‌ బకాయిలు రూ.265 కోట్లు విడుదల చేస్తామన్నారు. 6.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చేందుకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌, ఎస్‌సి, ఎస్‌టి స్కాలర్‌షిప్‌ బకాయిలు కలిపి రూ.788 కోట్లు, విద్యుత్‌శాఖ రాయితీలు రూ.500 కోట్లు, ఎన్‌టిఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ బకాయిలు రూ.400 కోట్లు, డ్రగ్స్‌, మెడిసిన్స్‌ బకాయిలు రూ.100 కోట్లు విడుదల చేస్తామన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కనీసం రూ.5-10 లక్షలు లోపు బిల్లులు కూడా అందక పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. 26 వేల మందికి లబ్ధి చేకూర్చే విధంగా రూ.586 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. 651 ఎంఎస్‌ఎంఇలకు, మరో ఆరు వేలమంది మైక్రో ఎంటర్‌ ప్రెన్యూర్లకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.90 కోట్ల పెండింగ్‌ బకాయిలను విడుదల చేస్తున్నామని చెప్పారు. రాజధాని, గన్నవరం విమానాశ్రయానికి భూములిచ్చిన రైతులకు కౌలు బకాయిల కింద రూ.241 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం 60:40 వాటాతో అమలు చేయాల్సిన 94 కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటాను చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని చెప్పారు. రూ.6 వేలకోట్లు కేంద్రానికి జమచేసి 73 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించామన్నారు.

➡️