బడ్జెట్‌లో ఏపికి మళ్లీ మొండి చేయి

Feb 1,2025 19:04 #Budget, #cpm, #V.Srinivas rao
  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-అమరావతి : కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఏపికి మళ్లీ మొండి చేయి చూపించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన శనివారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. ”ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలను అడియాసలు చేసింది. ఏపికి మళ్లీ మొండి చేయి చూపించింది. ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన హామీలను పక్కన పెట్టింది. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదు. విశాఖ రైల్వే జోన్‌, ఎన్‌ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్‌ ఐటి, ఐఐఎస్‌ఈఆర్‌, గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్‌ యూనివర్శిటీ, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌, వైజాగ్‌ మెట్రో, ఎయిమ్స్‌, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రాజధాని నిర్మాణానికి నిధుల ఊసేలేదు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంక్‌ రుణాన్నే పదే పదే ప్రస్తావించారు తప్ప కొత్తగా కేటాయింపు లేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల ఎంపిలు కేంద్రాన్ని నిలదీయాలి. అయితే మరోవైపు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు గతేడాది రూ.8,622 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత బడ్జెట్‌లో రూ.3,295 కోట్లు కేటాయించింది. అంటే గతేడాది కంటే బడ్జెట్‌ లో రూ.5,327 కోట్లను తగ్గించింది. ఆర్భాటంగా ప్రకటించిన రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రస్తావన లేదు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిలుపుదల గురించి మాట్లాడకపోవడం మోసం చేయడమే. విభజన హామీల్లో భాగంగా ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌ను ఈ బడ్జెట్‌ గాలికొదిలేసింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది రూ.5,512.50 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.5,936 కోట్లు కేటాయించింది. అయితే పునరావసం, పరిహారం ప్యాకేజీ గురించి స్పందించలేదు. రూ.55 వేల కోట్లు తాజా అంచనాలకు రూ.33 వేల కోట్లు తగ్గింది. నిర్వాసితులకు కోత విధించడానికే ప్రభుత్వం సిద్దపడడం దుర్మార్గం. ఏపికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహంపై ప్రజలు నిరసన వ్యక్తం చేయాలి” అని కోరారు.

➡️