తొమ్మిదో రోజుకు చేరిన శరన్నవరాత్రులు
నేటితో ముగియనున్న దసరా ఉత్సవాలు
ప్రజాశక్తి-వన్‌టౌన్ (విజయవాడ) : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ నెల 3 నుండి ప్రారంభమైన ఉత్సవాలు శనివారంతో ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తొమ్మిదో రోజు శ్రీ మహిషాసురమర్ధని దేవిగా దుర్గమ్మను అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు యాత్రికులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. మహిషాసురమర్ధనిగా ఉన్న దుర్గమ్మను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డిజిపి ద్వారకా తిరుమలరావు, సినీ నటుడు, నిర్మాత కె.అశోక్ కుమార్, సినీ నటి నాగళ్ళ అనన్య, పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు.