నేటి నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

  • విద్యుద్దీపాలతో దుర్గగుడి అలంకరణ
  • 3,500 మంది పోలీసులతో బందోబస్తు
  • 250 సిసి కెమెరాలతో నిఘా

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (విజయవాడ) : విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వరసామి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్‌ 3 నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలకు ఇంద్రకీలాద్రిని విద్యుద్దీపాలతో అలంకరించారు. దుర్గమ్మను రోజుకో అలంకారంతో అలంకరించనున్నారు. 13 శాఖలకు చెందిన అధికారులు ఉత్సవాల నిర్వహణలో నిమగమయ్యారు. ప్రత్యేక క్యూలైన్లు, స్నానఘాట్లు, వాహనాల పార్కింగ్‌, కేశఖండనశాల తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. సందర్శకుల రద్దీకి తగ్గట్లుగా క్యూలైన్ల సమీపంలోనే లగేజీ, పాదరక్షలు భద్రపర్చుకునేందుకు క్లాక్‌ రూములను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. దుర్గమ్మ సందర్శకులకు నగరంలోని కెనాల్‌ రోడ్డు వినాయకుని గుడి వద్ద నుండి ఘాట్‌ రోడ్డు మీదుగా రెండు కిలో మీటర్ల మేర నడుకుంటూ ఇంద్రకీలాద్రిపైకి వెళ్లేందుకు రూ.300, రూ.100 ఖరీదు గల క్యూలైన్లతోపాటు ఉచిత క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కృష్ణానదిలో నీరు అధికంగా ఉండడంతో దుర్గా ఘాట్‌, పద్మావతి ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే వారి కోసం పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్నానాల కోసం 700 షవర్లు ఏర్పాటు చేశారు. కనకదుర్గానగర్‌లో అన్నదానం, ప్రసాదం కౌంటర్లు సిద్ధం చేశారు. దర్శనానికి వచ్చే వారిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు ప్రతిచోటా హెచ్చరిక బోర్డులను, సమాచారం ఇచ్చే సూచికలను ఏర్పాటు చేశారు. 250 సిసి కెమెరాలను నిఘా కోసం ఏర్పాటు చేశారు. సుమారు 25 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. దర్శనానికి వచ్చే వివిఐపిలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులకు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. దసరా బందోబస్తుకు సుమారు 3,500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ నిర్వహించే సాంస్కతిక కార్యాక్రమాల వేదికను కనకదుర్గానగర్‌ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు.

➡️