సత్వరమే కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీ : డివైఎఫ్‌ఐ డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని డివైఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై రాము, జి రామన్న బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెండేళ్ల క్రితం విడుదల చేసిన 6,100 కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ ప్రక్రియను ఇప్పటి వరకు పూర్తిచేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 95,208 మంది అభ్యర్థులు ప్రాథమిక రాత పరీక్ష రాసి అర్హత సాధించారని, వీరికి దేహదారుఢ్య పరీక్షలు, మెయిన్స్‌ రాత పరీక్షలు ఇప్పటి వరకు నిర్వహించలేదని తెలిపారు. గత ప్రభుత్వం హోంగార్డులకు రిజర్వేషన్లు పెంచడం వల్ల నిరుద్యోగులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందన్నారు. పాత పద్ధతిలోనే నియామకం చేయాలని డిమాండ్‌ చేశారు. హోంగార్డుల పేరుతో ఉన్న ఉద్యోగాలను నిరుద్యోగులకు కాకుండా చేసే కోర్టు తీర్పుపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. కూటమి ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుందని నిరుద్యోగులు భావించారని తెలిపారు. గత ప్రభుత్వం మాదిరిగానే వ్యవహరిస్తూ ప్రస్తుత ప్రభుత్వం కూడా కేసు విచారణకు హాజరుకాకుండా నిరుద్యోగులను నయవంచన చేస్తోందని పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఎంతో మనోవేదనకు గురవుతూ, ఆర్థికంగా చితికిపోయారని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్‌ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ అంశంపై ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు కలెక్టరేట్ల వద్ద ఆందోళనలు నిర్వహించారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే విజయవాడలో పెద్దయెత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

➡️