సరుకు లోడింగ్‌లో ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే రికార్డు

ప్రజాశక్తి – ఎంవిపి కాలనీ (విశాఖ) : 2024-25 ఆర్థిక సంవత్సరంలో 290 రోజుల్లోనే 2003 మిలియన్‌ టన్నుల సరుకు లోడింగ్‌ చేయడం ద్వారా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే గత రికార్డులను బద్దలు కొట్టిందని రైల్వే అధికారులు ఒక ప్రకటన ద్వారా తెలిపారు. దేశంలోని ఏ రైల్వే జోనూ సాధించని విధంగా 2025 జనవరి 15 నాటికి ఈ మైలు రాయిని చేరుకుందని పేర్కొన్నారు. ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఇదే మైలురాయిని చేరుకోవడానికి 295 రోజులు పట్టగా, ఈ ఏడాది 5 రోజుల ముందుగానే ఆ మైలురాయిని అందుకుందని తెలిపారు. గతంలో 200 మెట్రిక్‌ టన్నుల సరుకు లోడింగ్‌కు 300 రోజులు పైనే పట్టేదని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే 1.6 శాతం సరుకు రవాణా పెరిగిందని తెలిపారు. ఈ రవాణాలో 119.637 మెట్రిక్‌ టన్నుల బొగ్గు, 7.67 మెట్రిక్‌ టన్నుల ఉక్కు కర్మాగారాలకు ముడిసరుకులు, 15.991 మెట్రిక్‌ టన్నుల పిగ్‌ ఐరన్‌ అండ్‌ ఫినిష్డ్‌ స్టీల్‌, 24.426 మెట్రిక్‌ టన్నుల ఇనుప ఖనిజం, 0.88 మెట్రిక్‌ టన్నుల సిమెంట్‌, 2.226 మెట్రిక్‌ టన్నుల ఆహార ధాన్యాలు, 5.477 మెట్రిక్‌ టన్నుల ఎరువులు, 2.317 మెట్రిక్‌ టన్నుల మినరల్‌ ఆయిల్‌, 4.372 మెట్రిక్‌ టన్నుల సరుకులు రవాణా జరిగినట్లు వివరించారు. ఈ సరుకు రవాణా ద్వారా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఆదాయం రూ.20.288 కోట్లు ఆదించిందనిపేర్కొన్నారు. ప్రధానంగా డబ్లింగ్‌ మూడు, నాలుగవ లైన్‌ ప్రాజెక్ట్‌లతో కొత్త రైలు మార్గాల నిర్మాణం, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల ద్వారా పరిశ్రమలను- ఒడరేవులను అనుసంధానం, కీలకమైన సరుకు రవాణా కేంద్రంగా జోన్‌ను బలోపేతం చేయడం, సకాలంలో సరుకు రవాణా, పరిశ్రమలతో నిరంతరం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడం వంటి అంశాలు కీలక పాత్ర పోషించాయని వివరించారు.

➡️