వలంటీర్ల విషయంలోఎన్నికల కమిషన్‌ ఆదేశాలు అమలు చేయాలి- సిఇఒకు సిపిఎం లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల విధులకు వలంటీర్లను ఉపయోగించరాదన్న ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను అమలు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈ మేరకు శుక్రవారం చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు లేఖ రాశారు. వలంటీర్లను ఎన్నికల విధులకు రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఎన్నికల కమిషన్‌, న్యాయస్థానం స్పస్టమైన ఆదేశాలిచ్చాయని పేర్కొన్నారు. అయినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని తెలిపారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని పేర్కొన్నారు. వలంటీర్లకు గిఫ్టు బాక్సులు, తాయిలాలిచ్చి వారిని ప్రలోభ పెడుతున్నారని వివరించారు. పార్టీని గెలిపించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు బహిరంగంగా వలంటీర్లను ఆదేశిస్తున్నారని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా వలంటీర్లతో సర్వే చేయిస్తున్నారని, అధికార పార్టీ అభ్యర్థుల సభల్లో, కార్యకలాపాల్లో పాల్గంటున్నట్లు పత్రికల్లో వార్తలు వస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల ప్రోద్బలంతో వలంటీర్లకు ఓటరు లిస్టులు ఇచ్చి, ప్రభావితం చేసే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనికి సంబంధించిన వార్తలు రోజూ పత్రికల్లో వస్తున్నాయని తెలిపారు. ఈ విషయాలను తీవ్రంగా పరిగణించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

➡️