ఇసి కొరడా

May 13,2024 06:50 #2024 election, #nandyala
  • పోలీస్‌పై ఇసి గురి – నంద్యాల ఎస్‌పి, డిఎస్‌పితోపాటు ఆరుగురు సిఐలపై వేటు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరికొన్ని గంటల్లోనే పోలింగు ప్రారంభమవుతుండగా, కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ఉల్లంఘనలపై తీవ్ర చర్యలకు పూనుకుంది. ఇప్పటికే డిజిపితోపాటు పలువురు ఎస్‌పిలు, ఇద్దరు డిఐజిలపై వేటువేసిన ఎన్నికల కమిషన్‌, తాజాగా ఎస్‌పి, డిఎస్‌పిని, ఆరుగురు సిఐలను ఎన్నికల విధుల్లోంచి తప్పించింది. ముందస్తు అనుమతి లేకుండా నంద్యాల పట్టణంలో వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డికి మద్దతుగా సినీ హీరో అల్లు అర్జున్‌ భారీ ర్యాలీ చేయడంతోపాటు రవిచంద్రను గెలిపించాలని చేసిన ప్రచారానికి పోలీసులే రక్షణ కల్పించడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల స్క్వాడ్‌ ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్‌పి రఘువీరారెడ్డి, డిఎస్‌పి రవీంద్రనాథ్‌రెడ్డి, సిఐ రాజారెడ్డిని ఎన్నికల విధుల్లోంచి తప్పిస్తూ శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. అలాగే తిరుపతి జిల్లాలో కోడ్‌ ఉల్లంఘించి, అధికార పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులతో ఐదుగురు సిఐలపై చర్యలు తీసుకుంది. తిరుపతికి చెందిన ఈ ఐదుగురు సిఐలను అనంతపురం జిల్లాకు బదిలీ చేసింది. సిఐలు జగన్‌మోహన్‌రెడ్డి, అంజూయాదవ్‌, అమర్‌నాథ్‌రెడ్డి, శ్రీనివాసులు, వినోద్‌కుమార్‌ను అనంతపురంలో ఎన్నికల విధులు నిర్వహించాలని ఇసి ఆదేశించింది.

➡️