మాజీ ఎంపీ ఎంవివికి ఇడి షాక్‌

రూ.42.03 కోట్ల ఆస్తులు తాత్కాలిక జప్తు
ప్రజాశక్తి-గ్రేటర్‌ విశాఖ బ్యూరో : వైసిపి విశాఖ మాజీ ఎంపీ ఎంవివి.సత్యనారాయణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) షాక్‌ ఇచ్చింది. హయగ్రీవా ఫామ్స్‌కు చెందిన రూ.42.03 కోట్ల ఆస్తులను తాత్కాలికంగా శుక్రవారం జప్తు చేసింది. ఇందులో 14 స్థిరాస్తులు, రూ.2.71 కోట్ల విలువైన ఆరు చరాస్తులు ఉన్నాయి. విశాఖ నగరంలోని ఎండాడలోగల హయగ్రీవ ప్రాజెక్టుకు చెందిన 12.51 ఎకరాల భూమిని మోసపూరితంగా లాక్కొన్నారని గతేడాది జూన్‌ 22న చిలుకూరు జగదీశ్వరుడు, ఆయన భార్య రాధారాణి ఆరిలోవ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఇడి గతేడాది అక్టోబర్‌లో ఎంవివి.సత్యనారాయణ, ఆడిటర్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు (జివి) ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. ఈ భూముల అమ్మకాల్లో ఎంవివి బిల్డర్స్‌, మెస్సర్స్‌ హయగ్రీవా ఇన్‌ఫ్రా టెక్‌ ప్రాజెక్ట్సు లిమిటెడ్‌, గద్దె బ్రహ్మాజీలు భాగస్వాములై దాదాపు రూ.150 కోట్లు ఆర్జించినట్లు గుర్తించి చర్చలకు ఉపక్రమించింది.

➡️