ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గత ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్యారంగాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దితే టిడిపి ప్రభుత్వం వచ్చాక అస్తవ్యస్తంగా తయారు చేస్తోందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని విధంగా జాతీయ విద్యా విధానాన్ని వైసిపి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిందన్నారు. విద్యారంగాన్ని మార్చేస్తామని కూటమి చెబుతోందంటే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని రద్దు చేస్తారా? అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిందని గుర్తు చేశారు. జాతీయ విద్యా విధానానికి కూటమి ప్రభుత్వం వ్యతిరేకమా? అనుకూలమా? చెప్పాలన్నారు. తల్లికి వందనం అమలు చేయకుండా మోసం చేశారని విమర్శించారు. ఎన్నికలకు ప్రజలను ఓట్ల కోసం భ్రమల్లో వుంచిన సూపర్ సిక్స్ ఇప్పుడు కనిపించడం లేదని పేర్కొన్నారు.
