ప్రభావతికి మళ్లీ జ్ఞాపక శక్తి రావాలి

  • డిప్యూటీ స్పీకర్‌ కనుమూరి రఘురామకృష్ణరాజు

ప్రజాశక్తి – ఉండి (పశ్చిమగోదావరి) : డాక్టర్‌ ప్రభావతికి మళ్లీ జ్ఞాపకశక్తి రావాలని, ఎంబిబిఎస్‌లో చదివినవి మళ్లీ గుర్తుకు రావాలని ప్రార్థించడం తప్ప, మనం చేసేదేమీ లేదని డిప్యూటీ స్పీకర్‌, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు వ్యంగంగా వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎఎంసిలో ధాన్యం కొనుగోలు ప్రారంభోత్సవానికి విచ్చేసిన సందర్భంగా మీడియాతో ఆయన ముచ్చటించారు. తనను సిఐడి పోలీసులు గాయపరిచినా, లేదని నివేదికపై సంతకం చేసిన డాక్టర్‌ ప్రభావతి… తాను గైనకాలజిస్ట్‌ని, తనకు గాయాలంటే ఏంటో తెలియదని చెప్పడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎంబిబిఎస్‌ డాక్టర్లకు దెబ్బలపై కనీస అవగాహన లేదన్నట్లు మాట్లాడడం వెనుక ఎవరి ప్రోద్బలం ఉందో అర్థమవుతోందని పేర్కొన్నారు. తనకు మతిమరుపు ఉంది, తనకేమీ గుర్తు రావడం లేదని ఆమె చెప్పడం శోచనీయమన్నారు. సుప్రీంకోర్టు నుంచి తాత్కాలిక ఉపశమనం దక్కే వరకూ ఎవరికీ కనిపించకుండా మతిమరుపుతో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో ఆమెకు గతం గుర్తొచ్చే ఏర్పాట్లు జరుగుతాయని తాను భావిస్తున్నానని వ్యాఖ్యానించారు.

➡️