పాడి రైతుల అభ్యున్నతికి కృషి : చలసాని

Jun 10,2024 21:44 #Krishna Milk Union

ప్రజాశక్తి-గుడ్లవల్లేరు (కృష్ణాజిల్లా) : పాడి రైతుల అభ్యున్నతికి కృష్ణా మిల్క్‌ యూనియన్‌ నిరంతరం కృషి చేస్తోందని కృష్ణా మిల్క్‌ యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు అన్నారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలోని నాగవరం, వడ్లమన్నాడు పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘాల వద్ద ‘పాడి రైతు సంక్షేమం మన మతం- అలుపెరగని సేవ మన అభిమతం’ అనే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడి రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యూనియన్‌ పాడి రైతులకు అందించే ధర వ్యత్యాసం, కల్యాణమస్తు, క్షీరబంధు, ప్రతిభా, ఆక్సిడెంట్‌ కేర్‌ ట్రస్ట్‌ పథకాల గురించి, పాడి పశువులకు అందించే పశు బీమా, డీ వార్మింగ్‌, పశు దాణా, కాల్షియం, మినరల్‌ మిక్సర్‌ వాడటం వలన కలిగే ప్రయోజనాలను పాడి రైతులకు తెలియజేశారు. యూనియన్‌ వారు అందించే సెమెన్‌ విశాఖ ద్వారా పుట్టిన దూడలు భవిష్యత్‌లో ఎక్కువ పాల చార కలిగిన పశువులుగా రైతులకు అధిక లాభాలు ఆర్జించగలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలకవర్గ సభ్యులు విబికెవి సుబ్బారావు, గుడ్లవల్లేరు పాల శీతల కేంద్రం మేనేజర్‌ తోట సత్యనారాయణ, నాగవరం వడ్లమన్నాడు సంఘం అధ్యక్షులు మోదుగమూడి మంగారావు, తోట సుబ్రహ్మణ్యం, సూపర్‌వైజర్‌ పెయ్యేటి బసవ రాజకుమార్‌, పాల ఉత్పత్తి దారులు పాల్గొన్నారు.

➡️