వీసా అప్లికేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు కృషి

  • యుఎస్‌ కాన్సులేట్‌ ప్రతినిధులతో హోంమంత్రి అనిత

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వీసా అప్లికేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు. హైదరాబాద్‌లోని యుఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి ఆమె వెళ్లి అక్కడి ప్రతినిధులతో సోమవారం సమావేశమయ్యారు. అమెరికా దౌత్య కార్యాలయ అధికారులైన పొలిటికల్‌ ఎకనమిక్‌ చీఫ్‌ ఫ్రాంక్‌ టల్లుటో, రీజనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ కలే నందుకు రాష్ట్ర పరిస్థితులను వివరించారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారి సంఖ్య ఆంధ్రప్రదేశ్‌లో బాగా పెరిగిందని తెలిపారు. అమెరికా వెళ్లాలనుకునే వారి వీసా ఇంటర్వ్యూ నిరీక్షణ సమయం ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. అలాగే పర్యాటకులు, పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనే వీసా అప్లికేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుందని కోరారు. అలాగే అమెరికా అభివృద్ధిలో తెలుగు ప్రజల పాత్ర, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి ఈ సమావేశంలో చర్చించారు. సులభతరమైన వీసా విధానానికి గల మరిన్ని అవకాశాలు సహా వీసా సెంటర్‌ ఏర్పాటుపై పరిశీలిస్తామని యుఎస్‌ రాయబార కార్యాలయ ప్రతినిధులు.. హోంమంత్రి అనితకు హామీ ఇచ్చారు.

➡️