ఫూలే ఆశయ సాధనకు కృషి

  • గంజాయి పేరుతో సంక్షేమ పథకాలకు కోతా?
  • ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమాజంలో అట్టడుగు శ్రమ జీవుల హక్కుల కోసం పోరాడిన జ్యోతి బా ఫూలే ఆశయ సాధన కోసం పోరాడటం అంటే ఆలోచనలను అర్థం చేసుకుని ఆచరించడమని, ఐద్వా ఆ దిశగా కృషి చేయడంతో ఆయనకు ఘన నివాళి అర్పిస్తుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి తెలిపారు. వడ్డేశ్వరంలోని ఐద్వా కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సమావేశం సందర్భంగా ఫూలే వర్థంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ… పేదలపై, శ్రమజీవులపై భారాలు వేయడంలో ఒక ప్రభుత్వంతో మరో ప్రభుత్వం పోటీ పడుతున్నాయన్నారు. గంజాయిని వంద రోజుల్లో నిర్మూలిస్తామని చెప్పిన మాటలు ప్రగల్భాలుగానే మిగిలాయని, ఇప్పుడు సంక్షేమ పథకాలతో లింకు పెట్టి పేదలకు పథకాలు అందకుండా ఎసరు పెడుతున్నారని చెప్పారు. కొన్ని కుటుంబాల్లో బిడ్డలు, భర్త గంజాయి లేక మద్యానికి బానిసలైతే తల్లులు నిస్సహాయంగా రోదిస్తున్నారని తెలిపారు. గంజాయి వ్యాపారం చేసే వారని, వారికి అండగా ఉన్న రాజకీయ నాయకులను పట్టుకోలేని ప్రభుత్వం గంజాయి దొరికితే సంక్షేమ పథకాలు రద్దు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. డిసెంబరు 10 వరకూ వెర్రితలలు వేస్తున్న విష సంస్కృతిని నిరసిస్తూ విస్తృత ప్రచారం చేయాలని మహిళలకు రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని చెప్పారు. విద్యుత్‌ ట్రూ అప్‌ ఛార్జీల పేరిట ప్రజలపై భారం వేయడం తగదని, ఈ విషయంలో జరిగిన అవినీతిపై విచారించి ముడుపులు అందుకున్నవారి నుంచి ప్రభుత్వం ఆ మొత్తాన్ని వసూలు చేయాలని, అక్రమ విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై భారాలు లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. కందిపప్పు, నూనె, చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తానన్న రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాన్ని ఇంతవరకూ అమలు చేయకపోవడాన్ని ప్రశ్నించారు. ఉచిత సిలిండర్‌ పథకాన్ని నగదు బదిలీ విధానంలో కాకుండా నేరుగా ఉచితంగా అందించాలని కోరారు. రూ.10 లక్షల వరకూ డ్వాక్రా రుణాలకు జీరో వడ్డీని అమలు చేయాలన్నారు. అధిక ధరలపై సంతకాలు సేకరించి ప్రధాన మంత్రికి కూడా పంపాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని చెప్పారు. ఈ సమావేశానికి ప్రభావతి అధ్యక్షత వహిం చగా, సత్యవతి, శ్రీనివాస కుమారి, పూర్ణ, రమణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

➡️