పింఛన్ల కోసం వెళ్లి ముగ్గురు వృద్ధులు మృతి

Apr 4,2024 22:30 #Deaths, #pensions in AP

ప్రజాశక్తి-యంత్రాంగం : పింఛన్ల పంపిణీలో గురువారం విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మండుటెండల్లో పెన్షన్‌ కోసం వెళ్లి వైఎస్‌ఆర్‌ కడప, అనంతపురం జిల్లాల్లో ముగ్గురు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం పోతంగి సచివాలయం పరిధిలోని పింఛన్‌ లబ్ధిదారులు సుమారు పది కిలోమీటర్ల దూరం నడిచి సచివాలయానికి వచ్చారు. ఎండ తీవ్రతతో సచివాలయం ఎదురుగానున్న హైవే రోడ్డు పక్కన చెట్టు నీడన పడిగాపులు కాశారు. వైఎస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురం మండలం లోమడ గ్రామానికి చెందిన నారాయణమ్మ(70) పింఛను తీసుకునేందుకు గ్రామంలోని సచివాలయం వద్దకు వెళ్లారు. తిరిగి వస్తూ ఎండకు తట్టుకోలేక దారి మధ్యలోనే సొమ్మసిల్లి పడిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను పులివెందులలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయారు. వడదెబ్బ తగిలి మరణించినట్లు వైద్యులు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి టైలర్స్‌ కాలనీకి చెందిన హుస్సేన్‌మియా (72) పింఛను కోసం బుధవారం సచివాలయం వద్దకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఇంటికి వస్తుండగా ఎండవేడిమికి కళ్లు తిరిగి కింద పడ్డారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆయన్ను తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రితికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం హుస్సేన్‌మియా మరణించారు. తాడిపత్రి మండలం చిన్నపడమల గ్రామానికి చెందిన ఆదెమ్మ (70) పింఛను తీసుకు నేందుకు బుధవారం మధ్యాహ్నం సచివాలయానికి వెళ్లారు. ఎండకు తట్టుకోలేక అస్వస్థకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం ఆదెమ్మ మరణించారు.

➡️