ప్రాణం తీసిన ఎన్నికల ఒత్తిడి

– గుండెపోటుతో వికలాంగ ఉపాధ్యాయుడి మృతి
– మినహాయింపు కోసం విన్నవించుకున్నా కనికరించని అధికారులు
ప్రజాశక్తి – పెరవలి (తూర్పుగోదావరి) :ఎన్నికల విధుల్లో ఒత్తిడికి గురైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా పెరవలి గ్రామంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పెరవలి మండలం పెరవలి గ్రామంలోని ఎంపిపి పాఠశాల-1లో కొలనువాడ సుబ్బరాజు (59) సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు 80 శాతం అంగవైకల్యం ఉండడంతో ప్రతిరోజూ మరొకరి సాయంతో విధులకు హాజరయ్యేవారు. ఏడాది క్రితం ఆయన గుండెపోటుకు గురయ్యారు. చికిత్స అనంతరం తిరిగి విధులకు హాజరయ్యారు. ఇటీవల ఆయనకు రాజమహేంద్రవరం రూరల్‌ ధవళేశ్వరంలో ఎన్నికల డ్యూటీ వేశారు. తనకు ఎలక్షన్‌ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులను కోరారు. అధికారులు కనికరించకపోవడంతో మానసికంగా కుంగిపోయారు. ఈ క్రమంలో శనివారం గుండెపోటుకు గురై మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుని కుటుంబాన్ని పెరవలి ఎంఇఒ బి.స్వరూప్‌ పరామర్శించారు

➡️