- రబ్బరు స్టాంప్‌ల ఎన్నికల కమిషన్
- సిద్ధార్థ న్యాయ కళాశాలలో నిర్వహించిన సదస్సులో ప్రశాంత్ భూషణ్
ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : దేశంలో ప్రజాస్వామ్యం బలోపేతానికి ఎన్నికల సంస్కరణలు అవసరమని ప్రముఖ అభ్యుదయ వాది, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఉద్ఘాటించారు. శనివారం విజయవాడలోని సిద్ధార్థ న్యాయ కళాశాల విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రధాన అధ్యాపకులు చెన్నుపాటి దివాకర్ బాబు అధ్యక్షతన జరిగిన సదస్సులో ”భారతదేశంలో భాగస్వామ్య ప్రజాస్వామ్యం బలోపేతం కోసం ఎన్నికల సంస్కరణల ఆవశ్యకత” అనే అంశంపై ప్రశాంత్ భూషణ్ ఉపన్యాసించారు. భారత రాజ్యాంగానికి పునాది ప్రజాస్వామ్యమని, కానీ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం మన దేశ రాజ్యాంగ లక్ష్యాల సాధనలో వెనుకబడిందని, ఎన్నికైన ప్రజాప్రతినిధులు వారిని ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాకుండా వారి వ్యక్తిగత ఆశక్తుల కోసం మాత్రమే పనిచేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల్లో పోలయిన ఓట్లలో ఒకరికి 49 శాతం ఓట్లు వచ్చి ఇంకొకరికి 51 శాతం ఓట్లు వస్తే ఆ 49 శాతం ప్రజల ఓట్లు పొందిన వ్యక్తికి ప్రజాస్వామ్యంలో ఎటువంటి భాగస్వామ్యమూ లేదన్నారు. ధనం, అధికారం అనే చట్రంలో ఇరుక్కొని ఓటేస్తున్న ప్రజలకు పార్లమెంటు చేస్తున్న చట్టాలను పరిశీలించడానికి లేదా అడ్డుకోవడానికి అత్యంత తక్కువ అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. పార్లమెంటులో ఎటువంటి చర్చ లేకుండానే ఒకేసారి పది నుంచి ఇరవై బిల్లులను ఆమోదిస్తున్న సందర్భం మనం చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటు కూడా అచేతనంగా మారిపోయిందని విమర్శించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా టిఎన్ శేషన్ నుంచి 2014 వరకు భారత ఎన్నికల కమిషన్ పక్షపాత రహితంగా స్వతంత్రంగా వ్యవహరించిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదన్నారు. కానీ, మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత భారత ఎన్నికల సంఘం ఒక రబ్బర్ స్టాంప్‌గా మారిపోయిందని విమర్శించారు. ఎన్నికల ఖర్చుని కేవలం బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే ఖర్చు చేసేవిధంగా నియమాలు మార్చితే ఎన్నికలలో ధన ప్రవాహాన్ని కొంచెం అడ్డుకునే ఆస్కారం ఉందని అన్నారు. ఎన్నికల బాండ్ల ద్వారా రూ.ఎనిమిది వేల కోట్లు, ఇతర మార్గాల ద్వారా మరో రూ.ఎనిమిది వేల కోట్లు బిజెపికి గత పదేళ్లలో విరాళాలుగా వచ్చాయని అన్నారు. రాష్ట్ర మాజీమంత్రి, రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభానాద్రీశ్వరరావు మాట్లాడుతూ…దేశంలో ప్రస్తుతప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని విమర్శించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులున్నప్పటికీ ఎన్నికల కమిటీల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించడానికి పార్లమెంట్‌లో చట్టం చేశారని, తద్వార ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని మండిపడ్డారు. కెఎల్ రావు కుమారుడు కె.విజయారావు తదితరులు పాల్గొన్నారు.