- పోటాపోటీగా ప్రచారం
- ఉద్యోగుల సమస్యలే ప్రధాన ఎజెండా : ఎస్‌సిఆర్‌ఎంయు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : దక్షిణ మధ్య రైల్వేలో గుర్తింపు సంఘం కోసం మరో రోజులో ఎన్నికలు జరగనున్నాయి. రైల్వే నిబంధనల ప్రకారం మొత్తం ఓట్లలో 30 శాతం వస్తే సంఘం గుర్తింపు సంఘమవుతుంది. దీనికోసం నెల రోజుల నుండి పెద్దయెత్తున సంఘాల ప్రచారం నిర్వహిస్తున్నాయి. విజయవాడ వంటి చోట్లయితే రైల్వేస్టేషన్ పరిసరాలన్నీ సంఘాల బ్యానర్లతో నిండిపోయాయి. సాధారణ ఎన్నికల హడావుడిని తలపిస్తున్నాయి. నాలుగో తేదీ నుండి జరిగే ఎన్నికల్లో జోన్ పరిధిలో సుమారు 80 వేలమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో విజయవాడ డివిజన్లో 17,577 మంది సభ్యులున్నారు. ఇక్కడ ప్రధానంగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ (ఎస్‌సిఆర్‌ఎంయు), సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఫ్‌ు (ఎస్‌సిఆర్‌ఇయు) మధ్య పెద్దయెత్తున పోటీ నెలకొంది. ఇవి కాకుండా రైల్ మజ్దూర్ యూనియన్, ఐఆర్‌ఎంయుతోపాటు ఈ ఏడాది బిజెపి అనుబంధ డిఎంఆర్‌కెఎస్ కూడా పోటీలో ఉంది. అయితే ప్రధానంగా మజ్దూర్ యూనియన్, ఎంప్లాయీస్ సంఫ్‌ు మధ్యే పోటీ నెలకొంది. మజ్దూర్ యూనియన్ తరపున సెక్రటరీ ఎం లీలా, అధ్యక్షులు గుప్తా పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు. యూనియన్ తరపున ఉద్యోగులకు చేసిన సేవలను వివరిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రమాదకరంగా మారిన ఎన్‌పిఎస్ నుండి యూనిఫైడ్ పెన్షన్ సిస్టమ్‌లోకి మార్చడం వెనుక యూనియన్ జాతీయ నాయకులు శివగోపాల్ మిశ్రా నేతృత్వంలో నిర్వహించిన ఆందోళనలను వివరిస్తున్నారు. అలాగే బోనస్‌లను ఇప్పించడంలో మజ్దూర్ యూనియన్ నాయకత్వం పోరాట పటిమే కారణమని ఉద్యోగులకు వివరిస్తున్నారు. ముఖ్యంగా ప్రమోషన్ల విషయంలోనూ, ట్రాక్‌మెన్ల సమస్యల పరిష్కారంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించామని వారు తెలిపారు. అలాగే ట్రాక్ మెయింటేనెన్స్ గ్రేడ్‌పేను ఒకటి నుండి నాలుగుకు తీసుకొచ్చామని వివరించారు. పాయింట్స్‌మెన్ కేటగిరిలోనూ నాలుగు గ్రేడ్లు అమలయ్యేలా చూస్తున్నామని తెలిపారు. వీటిల్లో చాలా వాటికి రైల్వేబోర్డు ఆమోదం తెలిపిందని ఇచ్చిన హామీల్లో కొన్ని 2025 నుండి అమలవుతాయని లీలా, గుప్తా తెలిపారు. వ్యక్తిగత స్వార్థ్యం లేకుండా ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేసే సంఘం తమదేనని వారు పేర్కొన్నారు. అలాగే ఎంప్లాయీస్ సంఫ్‌ు తరపున తాము విజయం సాధిస్తామని డివిజన్ సెక్రటరీ ఆకుల రాఘ వేంద్ర కూడా తెలిపారు. ఉద్యోగుల కోసం చేసిన సేవలు మర్చిపోలేనివని, వాటిని అందరూ గుర్తుపెట్టుకుంటారని పేర్కొన్నారు.