త్వరలో ఎన్నికల షెడ్యూల్‌  : ముఖేష్‌కుమార్‌ మీనా

  • నెలాఖరు కల్లా శిక్షణ పూర్తి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో అన్ని రకాల బృందాలకు శిక్షణా కార్యక్రమాలు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనరు ముఖేష్‌కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణా కార్యక్రమాలను మార్చి నెలలో నిర్వహించుకోవచ్చన్నారు. సచివాలయం నుంచి శనివారం అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియా కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల సంసిద్ధతకు, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన వెంటనే అమల్లోకి వచ్చే ఎన్నికల నియమావళి ప్రకారం ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, స్టాటిక్‌ సెర్వెలెన్స్‌ టీములు, వీడియో వ్యూయింగ్‌ టీములు, ఎన్నికల ఖర్చులు, మేనేజ్‌మెంట్‌ టీములు, ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్నారు. ఆర్‌ఓ, ఎఆర్‌ఓలు, ఇఆర్‌ఓలు, ఎఇఆర్‌ఓలను అన్ని జిల్లాల్లో నియమించామన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓటర్లకు సౌకర్యాలు కల్పించే కేంద్రాలు, హోమ్‌ ఓటింగ్‌ బృందాలకు తగినంతమంది సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. వికలాంగులు, వయోవృద్ధులకు ఇంటి వద్ద నుంచే ఓటింగ్‌ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెవిన్యూ అధికారులు, సిబ్బందితో హోమ్‌ ఓటింగ్‌ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది డేటాను సంబంధిత పోర్టల్‌లో వెంటనే ఫీడ్‌ చేయాలన్నారు. ఎలక్షన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ పటిష్టంగా అమలుపరిచేందుకు సంబంధిత రెగ్యులేటరీ అథారిటీలతో సమన్వయంతో వ్యవహరిస్తూ ఉండాలని, ప్రతి అథారిటీ నుంచి తప్పనిసరిగా ఒక నోడల్‌ అధికారి ఉండేలా చూసుకోవాలని అన్నారు. ఇవిఎంల నుంచి తరలించే వాహనాలతోపాటు ప్లయింగ్‌ స్క్వాడ్‌, స్టాటిక్‌ సెర్వెలెన్స్‌ టీములు, వీడియో వ్యూయింగ్‌ టీములు, ఇతర బృందాల వాహనాలకు జిపిఎస్‌ సౌకర్యం ఉండాలన్నారు. కమ్యూనికేషన్‌ ప్లాన్‌ అమల్లో భాగంగా జిల్లా కేంద్రం నుంచి బ్లాక్‌స్థాయి వరకు ఉండే అందరు అధికారులతో పటిష్టమైన కమ్యూనికేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. సమస్యాత్మకమైన పోలింగ్‌ స్టేషన్లు అన్నింటికీ తప్పనిసరిగా మైక్రో అబ్జర్వర్లను నియమించాలని చెప్పారు. వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియాగ్రఫీ కవరేజ్‌లో ఆయా పోలింగ్‌ కేంద్రాల పరిసరాలను కూడా చిత్రీకరించేలా చర్యలు తీసుకోవాలని ముఖేష్‌కుమార్‌మీనా అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన వీడియో గ్రాఫర్లను, జిల్లాస్థాయిలోనే సమకూర్చుకోవాలన్నారు. పలు రకాల యాప్‌ల వినియోగాన్ని విస్తృతస్థాయిలో పెంచేందుకు టెక్నాలజీ వినియోగ ప్రణాళికను పట్టిష్టంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, అదనపు సిఇఓలు పి.కోటేశ్వరరావు, ఎమ్‌ఎన్‌ హరీందర్‌ ప్రసాద్‌, జాయింట్‌ సిఇఓ ఎ.వెంకటేశ్వరరావు, డిప్యూటీ సిఇఓ కె.విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.

➡️