విద్యుత్‌ బస్సులు ఆర్‌టిసికే అప్పగించాలి

Feb 9,2025 21:19 #APSRTC, #SWF

– ఎస్‌డబ్ల్యుఎఫ్‌ ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం డిమాండ్‌
ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ : విద్యుత్‌ బస్సుల నిర్వహణ ఆర్‌టిసికే అప్పగించాలని, ప్రయివేటు వారికి అప్పగించొద్దని ఆర్‌టిసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌డబ్ల్యుఎఫ్‌) రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎస్‌కె.జిలానీ బాషా కోరారు. ఎస్‌డబ్ల్యుఎఫ్‌ రాష్ట్ర ఆఫీస్‌ బేరర్స్‌ సమావేశం ఏలూరులోని సిఐటియు జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిలానీ భాషా అధ్యక్షత వహించి మాట్లాడుతూ.. పిఎంఇ పథకం కింద కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్‌.సుందరయ్య, అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ.. పెండింగులో ఉన్న రెండు డిఎలను వెంటనే ప్రకటించాలని, డిఎ ఎరియర్స్‌ ఇవ్వాలని, మూడేళ్లుగా ఇవ్వాల్సిన లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ వెంటనే ఇప్పించాలని కోరారు. 12వ పిఆర్‌సి వెంటనే నియమించాలని, ఈలోపు ఐఆర్‌ 30 శాతం ఇవ్వాలని, గతంలో నిలిపివేసిన ఎస్‌ఆర్‌బిఎస్‌ స్కీమ్‌ను పునరుద్దరించాలని, 30 సంవత్సరాలు పూర్తయిన వారికి రూ.3,200 ఎస్‌ఆర్‌బిఎస్‌ పెన్షన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ప్రధాన కార్యదర్శి ముసాయిదా కర్తవ్యాలను ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఉప ప్రధాన కార్యదర్శి కట్టా సుబ్రహ్మణ్యం, ఇ.శివకుమార్‌, రాజశేఖర్‌, రామయ్య, సత్యనారాయణ, ఎం.అరుణ కుమారి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి టిపిఆర్‌.దొర పాల్గొన్నారు.

➡️