విద్యుత్‌ బస్సులను ఆర్‌టిసినే కొనుగోలు చేయాలి

Nov 26,2024 01:12 #electric buses, #procured, #RTC itself
  • స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విద్యుత్తు బస్సుల కొనుగోలు,నిర్వహణను ఆర్టిసి చేపట్టేట్లు చర్యలు తీసుకోవాలని ఆర్టిసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర కమిటి ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు ఎస్‌కె. జిలాని బాషా, అధ్యక్షప్రచార కార్యదర్శులు సిహెచ్‌.సుందరరావు, టి.పి.ఆర్‌ దొర సోమవారం సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఇతర రాష్ట్రాలలో విద్యుత్తు బస్సుల కోనుగోలు ప్రైవేటు సంస్థలే చేస్తున్నాయని, వాటిపై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఆ సంస్థలకే దక్కుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. వీటి నిర్వహణ, కార్యకలాపాలు ఆర్టీసి ద్వారా ప్రైవేటు సంస్థలే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీని వల్ల ఆర్టీసికి ఈ బస్సులపై వచ్చే ఆదాయం కంటే ప్రైవేటు సంస్థలకు చెల్లిస్తున్న సర్వీసు చార్జీ ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇది ఆర్టిసికి పెనుభారం కావచ్చని తెలిపారు. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో విద్యుత్తు బస్సులు కొనుగోలు, కార్యకలాపాలు, నిర్వహణ ఆర్టిసి (ఎపిపిటిడి)నే చేపట్టేటట్లు ఆదేశాలు ఇవ్వాలని సిఎంను కోరారు. దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి, ప్రయాణీకులకు భద్రత కల్పించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఆర్టిసికి నాలుగు వర్క్‌షాపులు ఉన్నాయని, వీటిలో అన్ని మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. ఒక వర్క్‌షాపును అభివృద్ధి చేసి విద్యుత్‌ బస్సుల తయారీ, మరమ్మతులకు వినియోగించాలని సూచించారు.
అదానీతో ఒప్పందాన్ని రద్దు చేయాలి:
అనంతపురం రామగిరిలో గతంలో విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించిన 330 ఎకరాల భూమిని అదానీకి లీజుకు ఇస్తూ చేసుకున్న ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని ఆర్టిసి స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ కోరింది. ఈ మేరకు ఆర్టిసి ఎండికి ఫెడరేషన్‌ గౌరవాధ్యక్షులు ఎస్‌కె.జిలాని బాషా, అధ్యక్షులు సిహెచ్‌.సుందరరావులు సోమవారం లేఖ రాశారు. ఈ ఒప్పందం సందర్భంగా ఆర్ధిక అవకతవకలు జరిగినట్లు కథనాలు వస్తున్నందున, ఈ స్థలాన్ని సొంత నిధులుతో లేక ఇతర ఆర్ధిక సంస్థల సహకారంతోనో అభివృద్ధి చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో ఎలక్ట్రికల్‌ బస్సుల అవసరాలు తీర్చుకోవచ్చన్నారు. ఈ స్థలాన్ని రౌండ్‌ క్లాక్‌ సోర్స్‌గా రాత్రి వేళల్లో విండ్‌ ఎనర్జీ, పగలి వేళల్లో సోలార్‌ ఎనర్జీని 24 గంటలు ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు.

➡️