మంత్రి ఇలాకాలో దళితులకు విద్యుత్‌ షాక్‌!

Jan 23,2025 07:26 #Electricity Bill, #Manyam District

బిల్లులు కట్టలేదని సరఫరా నిలిపివేత
రోడ్డుపై ధర్నా చేసిన మహిళలు
ప్రజాశక్తి-సాలూరు (పార్వతీపురం మన్యం జిల్లా) : సాక్షాత్తూ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఇలాకాలో దళితులకు విద్యుత్‌ షాక్‌ తగిలింది. విద్యుత్‌ బిల్లులు కట్టలేదన్న సాకుతో అధికారులు దళితుల ఇళ్లకు కరెంటు సరఫరా నిలిపివేశారు. దీంతో, పట్టణంలోని బంగారమ్మపేటలో దళిత వాడలో నివసిస్తున్న కుటుంబాలు అంధకారంలో ఉన్నాయి. మంగళవారం పార్వతీపురం నుంచి వచ్చిన ఇఆర్‌ఒ అధికారులు దళిత కాలనీలో విద్యుత్తు బిల్లులు చెల్లించని వారి ఇళ్లకు ఫీజులు తొలగించారు. దళితులు, గిరిజనులు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వాడుకోవచ్చని ప్రభుత్వం ఒకవైపు చెపుతూనే దళితుల ఇళ్లకు బిల్లులు పంపిణీ చేస్తున్నారు. దీంతో, వారు లబోదిబోమంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ విద్యుత్‌ బిల్లుల గురించి అడగలేదని, ఇప్పుడు ఎలా అడుగుతున్నారని వారు ప్రశ్నించారు. బుధవారం ఉదయం దళిత మహిళలు దండిగాం రహదారిపై ధర్నా చేశారు. తామంతా రెక్కాడితేగానీ డొక్కాడని బడుగులమని, తమకు ఎలాంటి ఉపాధి అవకాశాలూ లేవని వాపోయారు. నెలనెలా ప్రభుత్వ నిబంధనలకు లోబడే విద్యుత్‌ వినియోగిస్తున్నామని, అలాంటప్పుడు బిల్లులు ఎందుకు పంపిణీ చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నా దృష్టికి రాలేదు
బంగారమ్మపేట దళితవాడలో విద్యుత్‌ బిల్లులు చెల్లించని కారణంగా సరఫరా నిలిపివేసినట్లు నా దృష్టికి రాలేదు. స్పెషల్‌ టీం సభ్యులు బకాయిల వసూళ్లపై డ్రైవ్‌ నిర్వహించారు.
– రంగారావు, ఎడిఇ, సాలూరు

రెండు బల్బులు, ఒక ఫ్యాన్‌కు రూ.5 వేలపైన బిల్లు
ఇంట్లో రెండు బల్బులు, ఒక ఫ్యాన్‌ వాడుతున్నాను. రూ.5,731 బిల్లు కట్టాలని బెదిరిస్తున్నారు. కట్టకపోతే విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు. నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వాడుకోవచ్చనని ప్రభుత్వం చెబుతోంది. మరి బిల్లులు ఎందుకు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే నా మెదడుకు శస్త్ర చికిత్స జరిగింది.
– ముగడ సుశీలమ్మ, దళిత కాలనీ, బంగారమ్మపేట

బల్బు, ఫ్యాన్‌కే రూ.4 వేలు
నా ఇంట్లో ఒక బల్బు, ఒక ఫ్యాన్‌ మాత్రమే ఉన్నాయి. నాలుగు వేల రూపాయలు బిల్లు చెల్లించాలంటూ నా ఇంటికి విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఉచిత విద్యుత్‌ అని ఒకవైపు చెపుతూనే దళితుల ఇళ్లకు విద్యుత్‌ బిల్లులు ఎందుకు వసూలు చేస్తున్నారు?
– చింతల అప్పమ్మ, బంగారమ్మపేట

➡️