- భయాందోళనలో గిరిజనులు
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు మండలాల్లో గత కొన్ని రోజులుగా ఏనుగులు సంచరిస్తూ ఆస్తి, ప్రాణ నష్టం కలిగిస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి నుండి ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గల పార్వతీపురం మండలం రావికోన పంచాయితీ పరిసర గ్రామాల్లోకి చేరుకొని పామాయిల్ తోటల్లో తిష్ట వేయడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. కొమరాడ మండలం విక్రాంపురం పంచాయతీ నందాపురం మీదుగా పార్వతీపురం మండలం చినమరికి, చందలింగి నుంచి రంగాలగూడ తోటల్లో గురువారం ఉదయం చేరుకున్నట్లు ఫారెస్ట్‌రేంజ్ అధికారి మణికంఠ తెలిపారు. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతానికి చేరుకున్న ఏనుగులు కొద్ది రోజులు ఉండి వెనుతిరిగి వెళ్లడం అలవాటుగా మార్చుకున్నాయని, ప్రస్తుతం వీటి కదలిక గమనిస్తే మళ్లీ తిరిగి వెనక్కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఏదైనాప్పటికీ సంగంవలస, రావికోన, ఎమ్మార్ నగరం గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు కొత్తవలస, బట్టివలస గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రావికోనలోని గిరిజన సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులు బయటనే సంచరించకుండా చర్యలు సంబంధిత అధికారులు తీసుకోవాలని, ఏనుగుల సంచారంపై సచివాలయ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేయాలని అటవీ అధికారులు తెలియచేస్తున్నారు.