2047 నాటికి ‘సికిల్‌సెల్‌ ఎనీమియా’ నిర్మూలన

Jun 19,2024 23:21 #eradication, #Sickle Cell Anemia
  • వ్యాధిగ్రస్తులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు
  • కాంతిలాల్‌ దండే

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : 2047 నాటికి సికిల్‌సెల్‌ ఎనీమియాను నిర్మూలించడమే లక్ష్యంగా 2023లో కేంద్ర ప్రభుత్వం మిషన్‌ను ప్రకటించిందని గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే పేర్కొన్నారు. వ్యాధిగ్రస్తులందరికీ ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇచ్చామన్నారు. గిరిజన జనాభాలో ప్రతి 86 మందిలో ఒకరికి సికిల్‌సెల్‌ (వ్యాధి) రక్తహీనత (ఎనీమియా) ఉందని తెలిపారు. మంగళగిరి ఎయిమ్స్‌లో బుధవారం సికిల్‌సెల్‌ ఎనీమియా మిషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజనులకు స్క్రీనింగ్‌ టెస్టులు ఇప్పటికే మొదటి దశ పూర్తయిందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దేశవ్యాప్తంగా సికిల్‌సెల్‌ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో 0-40 ఏళ్ల మధ్య వయసున్న 7 కోట్ల మందికి అవగాహన కల్పించడం, నిర్ధారణ పరీక్షలు, కౌన్సెలింగ్‌ నిర్వహించడమే సికిల్‌సెల్‌ ఎనీమియా నిర్మూలన ప్రధాన ఉద్ధేశమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 19న ప్రపంచ సికిల్‌సెల్‌ అవేర్‌నెస్‌ డేను పాటిస్తున్నారని తెలిపారు. హిమోగ్లోబిన్‌ తక్కువ ఉన్న వారికి ఈ వ్యాధి వస్తుందన్నారు.
రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ డైరెక్టరు జె వెంకట మురళి మాట్లాడుతూ.. సికిల్‌సెల్‌ ఎనీమియా గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోందన్నారు. నిర్మూలన మిషన్‌లో భాగంగా రాష్ట్రంలోని వైద్యారోగ్య కుటుంబ సంక్షేమం, మహిళా, శిశు, గిరిజన సంక్షేమశాఖల సమన్వయంతో పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి ఎయిమ్స్‌ వైద్యులు, మెడికల్‌, పారా మెడికల్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️