- డీ లిమిటేషన్ పూర్తయితే అసెంబ్లీకి 75 మంది మహిళలు
- అసెంబ్లీలో సిఎం చంద్రబాబు ప్రకటన
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మహిళా సాధికరతను తమ ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో చూపుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శాసన సభలో ‘మహిళా సాధికారత’పై జరిగిన చర్చకు బుధవారం ఆయన సమాధానమిస్తూ మహిళలకు ఆస్తి హక్కును తొలిసారి కల్పించింది టిడిపి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టి రామారావేనని చెప్పారు. ఆ స్పూర్తితోనే ఇప్పటికీ తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో కూడా 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చినట్లు చెప్పారు. డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారని తెలిపారు. రాష్ట్రంలోని 42 వేల మంది ఆశావర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేయాలని నిర్ణయించినట్లు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచుతున్నట్లు చెప్పారు. 55 వేల మంది అంగన్వాడీ కార్యకర్తలకు, 48 వేల మంది ఆయాలకు మేలు చేసే విధంగా గ్రాట్యుటీ అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో లక్ష మంది డ్వాక్రా మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చనున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యేలు అందరూ సహకరిస్తే నియోజకవర్గానికి వెయ్యి మంది చొప్పున 1.75 లక్షల మందిని ఈ విధంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. మహిళల భద్రత కోసం 13 రకాల అంశాలతో శక్తి యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. 10 లక్షల ఎకరాల్లో మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ఈ సంఖ్యను 50 లక్షల ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న పెన్షన్లలో మహిళలే 50 శాతం కంటే అధికంగా ఉన్నారని తెలిపారు. ఒక్క రోజులో రూ.5 కోట్ల విలువైన 3.80 లక్షల లావాదేవీలు నిర్వహించి 35,220 డ్వాక్రా ఉత్పత్తులను ఆన్‌లైన్ మార్కెట్ చేసి రికార్డు సాధించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీని ప్రమోట్ చేస్తున్నట్లు చెప్పారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 24 సంస్థలతో ఒప్పందాలను చేసుకున్నట్లు తెలిపారు. అమూల్ లాగా రాష్ట్రంలో మహిళల ఉత్పత్తులకు ఒక బ్రాండ్ తీసుకురానున్నట్లు చెప్పారు. అరటి పీచుతో బ్యాగ్‌లు, చీరలు, బొమ్మలు తయారు చేస్తున్నారని, గుర్రపు డెక్కతో కూడా బ్యాగ్‌లు తయారు చేస్తూ సంపద సృష్టిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఆస్తిలో తల్లికి, చెల్లికి వాటా ఇవ్వడానికి నిరాకరించే వ్యక్తి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు.