25 నుంచి ఆగస్టు 15 వరకు మెదడు వాపు నిర్మూలన వ్యాక్సిన్‌

హైదరాబాద్‌: జూలై 25 నుంచి ఆగస్టు 15 వరకు మెదడు వాపు నిర్మూలన వ్యాక్సిన్‌ కార్యక్రమం ఉంటుందని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తెలిపారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో జపనీస్‌ ఎన్సెఫలిటీస్‌(జేఈ) వ్యాక్సిన్‌పై డీఈఓ, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీ, వక్ఫ్‌బోర్డ్‌ అధికారులతో వ్యాధుల కట్టడిపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, మదర్సాల్లో మెదడు వాపు(జపనీస్‌ ఎన్సెఫలిటీస్‌) వ్యాధి నిర్మూలన టీకా వ్యాక్సిన్‌ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. ప్రతి శుక్రవారం అందరూ డ్రైడే నిర్వహించాలని చెప్పారు. పూలకుండీలు, ఫ్రిడ్జీలు, టైర్లు, కొబ్బరి బోండాలు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. డయేరియా, డెంగీ, చికెన్‌ గున్యా వంటి విష జ్వరాల బారిన పడకుండా విద్యార్థులకు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి ఓఆర్‌ఎస్‌, జింక్‌ ప్యాకెట్లు అందించాలని సూచించారు. గురువారం నుంచి ఇంటింటా జ్వర సర్వే జరుగుతున్నదని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డాక్టర్‌ వెంకట్‌ తెలిపారు. అనంతరం డీఈఓ రోహిణి మాట్లాడుతూ.. విద్యార్థులకు, తల్లిదండ్రులకు వ్యాధులపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ శ్రీ కళ తదితరులు పాల్గొన్నారు.

➡️