హార్టికల్చర్, ఆక్వాకు ప్రాధాన్యం
పిడిఎస్ కోసం ప్రజలు తినే వెరైటీల సేద్యం
టెక్నాలజీతో సాగు కొత్త పుంతలు
వ్యవసాయశాఖలపై సిఎం సమీక్షలో నిర్ణయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతులకు ఆదాయం వచ్చే పంటలనే ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ‘అగ్రివాచ్’తో ఎప్పటికప్పుడు అధ్యయనం చేయించి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాలని అధికారులను కోరింది. రైతులు ఇష్టానుసారం పంటలు సాగు చేస్తున్నారని, ఈ పాత పద్ధతులు మారాలని సూచించింది. ఉద్యానవన పంటలను, ప్రకృతి సేద్యాన్ని పెంచాలని ఆదేశించింది. వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి రేటును తప్పనిసరిగా 20 శాతానికి పెంచాలని, రాబోయే ఐదేళ్లలో వృద్ధి రేటును 30 శాతానికి తీసికెళ్లాలని, అందుకనుగుణంగా ప్రణాళికలు, లక్ష్యాలు నిర్ణయించాలని కోరింది. వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. ఆ వివరాలను వ్యవసాయ మంత్రి కె అచ్చెన్నాయుడు మీడియాకు వివరించారు… ప్రస్తుతం వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధి రేటు 15.86 శాతంగా ఉందని. ఎట్టి పరిస్థితుల్లో 20 శాతానికి తక్షణం పెంచాలన్నారు. వ్యవసాయ పంటల కంటే హార్టికల్చర్ పంటలపై రైతులకు ఆదాయం రావట్లేదన్నారు. ’18 లక్షల హెక్టార్లలో హార్టికల్చర్ వలన స్థూల ఆదాయం 1.52 లక్షల కోట్లు కాగా, వ్యవసాయ పంటలు ఖరీఫ్, రబీ కలుపుకొని 52 లక్షల హెక్టార్ల సాగు ద్వారా 57 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అందుకే పామాయిల్, డ్రాగన్ ఫ్రూట్స్ వంటి వాటిని సర్కారు ప్రోత్సహిస్తుంది’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. పామాయిల్ పరిశ్రమలను పిపిపి పద్ధతిలో నెలకొల్పుతామని. తక్షణం 50 వేల ఎకరాల్లో సూక్ష్మ సేద్యాన్ని అదనంగా ప్రవేశపెడతామన్నారు. సబ్సిడీలిస్తామని చెప్పారు. కుప్పంలో హార్టికల్చర్ పంటలను నిల్వ చేసేందుకు కూలర్లు ఏర్పాటు చేయడంతో. ఆ ప్రయోగం విజయవంతమైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 శాతం సబ్సిడీ ఇచ్చి ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. ‘అనంతపురంలో పైలెట్ ప్రాజెక్టు కింద హార్టికల్చర్ హబ్‌గా నిర్ణయించాం… అటువంటి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా నిర్వహిస్తాం. హార్టికల్చర్ కోసం గ్రామీణ ఉపాధి హామీ నిధుల వాడకాన్ని రూ.200 కోట్ల వరకు పెంచుతాం. పురుగుమందులు, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించేందుకు ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రవేశపెడతాం. అందుకోసం అదనంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఒకప్పుడు ధాన్యం పండించిన రైతులు ధనవంతులుగా ఉండేవారు. ప్రస్తుతం పరిస్థితి రివర్స్ అయింది. హార్టికల్చర్ పంటలు పండించే రైతులు ధనవంతులవుతున్నారు. ఆక్వానూ ప్రోత్సహిస్తాం. తృణ ధాన్యాలను ప్రోత్సహిస్తాం. పిడిఎస్ బియ్యం రీసైక్లింగ్ అవుతోంది. అందుకోసం ప్రజలు ఏ రకాలను ఇష్టపడతారో వాటినే రైతులు పండించేలా చర్యలు చేపడతాం…’ అని మంత్రి తెలిపారు.