ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వంతో అంగన్‌వాడీ సంఘాలు జరిపిన చర్చలు సఫలం కావడంతో వామపక్ష నేతలు నిరాహార దీక్షలను విరమించారు. అంగన్‌వాడీలపై రాష్ట్రప్రభుత్వ అమానుష దాడిని నిరసిస్తూ సోమవారం ఉదయం వారు నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం స్పందించి అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక నిరాహార దీక్షలకు వెనకాడబోమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి జరిగిన చర్చలు సఫలమయ్యాయి. పెద్దసంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు దీక్ష జరుగుతున్న సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దీక్షను వామపక్ష నేతలు విరమించారు. ఎపి అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షురాలు బేబీరాణి నేతలకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
