- మూడు రోజుల పాటు అలరించిన చిన్నారులు
ప్రజాశక్తి – అనంతపురం కలెక్టరేట్ : అనంతపురం పట్టణంలోని లలితకళా పరిషత్‌లో మూడు రోజులపాటు జరిగిన అనంత బాలోత్సవం-5 పిల్లల సంబరం ఆదివారంతో ముగిసింది. 160 పాఠశాలల నుంచి 9 వేల మంది విద్యార్థులు 65 విభాగాల్లో పాల్గొని ప్రతిభను చాటుకున్నారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. చిత్రలేఖనం, వ్యాస రచన, డ్యాన్స్, జానపద పాటలు, దేశభక్తి పాటలు, పౌరాణిక నాటికలు, చదరంగం, వక్తృత్వం తదితర పోటీల్లో విద్యార్థులు తమ ప్రతిభ చూపారు. ఆదివారం సాయంత్రం జరిగిన ముగింపు సభలో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతపురం లలిత కళాపరిషత్ కల్లు సుబ్బారావు కళాక్షేత్రం, లలిత కళాపరిషత్ పూర్వ కార్యదర్శులు ఎ.నరసింహమూర్తి, గాజుల నారాయణస్వామి ప్రాంగణంలో బాలోత్సవం ముగింపు సభ నిర్వహించారు. అనంత బాలోత్సవం కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి వి.సావిత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బాలోత్సవం కమిటీ చైర్మన్ షమీమ్ షఫీవుల్లా, లలితకళాపరిషత్ కార్యదర్శి పద్మజ, రవికాంత్ రమణ, ఆర్‌ఐఒ వెంకట రమణ నాయక్, కేర్, క్యూర్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ అభిషేక్ రెడ్డి, ఐఎంఎ రాష్ట్ర నాయకులు మురళీకృష్ణ, ఐఎంఎ జిల్లా చైర్మన్ డాక్టర్ కొండయ్య, మానవతా రక్తదాతల సంస్థ తరిమెల అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు ఆట పాటలు అవసరమన్నారు. మంచి ఆలోచనా విధానంతో సమాజంలో మెలగాలని సూచించారు. అనంత బాలోత్సవం 5ను విజయవంతం చేసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయ, విద్యా సంస్థల యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంత బాలోత్సవ కమిటీ కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి జిలాన్, సభ్యులు ఓతూరు పరమేష్, రమణయ్య, గోవందరాజులు, లింగమయ్య, కోటేశ్వరప్ప, సరళ, దేవేంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.