- ఏలూరులో ప్రారంభించిన సినీ నటి మీనాక్షిచౌదరి
ప్రజాశక్తి – ఏలూరు స్పోర్ట్స్: పోలీసులు ప్రవేశపెట్టిన శక్తి యాప్‌ను మహిళలు, విద్యార్థినులు, ఉద్యోగినులు ఆపద సమయాల్లో వినియోగించుకుని రక్షణ పొందాలని సినీ నటి మీనాక్షి చౌదరి అన్నారు. ఏలూరు నగరంలోని షాపింగ్ మాల్‌లో బంగారు ఆభరణాల దుకాణాన్ని ప్రారంభించేందుకు ఆమె బుధవారం వచ్చారు. ఈ సందర్భంగా అదే నగల దుకాణం వద్ద ఏలూరు డిఎస్‌పి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి యాప్‌ను మీనాక్షి చౌదరి ప్రారంభించి, యాప్‌కు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల భద్రత కోసం శక్తి యాప్‌ను ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు. ఈ యాప్‌ను సెల్‌ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఆపద సమయాల్లో మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. నిరంతరం మహిళలకు రక్షణగా నిలుస్తున్న మహిళా పోలీసులకు అభయ రక్షక దళ టీమ్‌కు ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుబ్బారావు, మూడో పట్టణ సిఐ కోటేశ్వరరావు, ప్రముఖ నిర్మాత అంబికా కృష్ణ, సిఎంఆర్ సంస్థల అధినేత, సిబ్బంది పాల్గొన్నారు.