బియ్యం, కందిపప్పు ప్రత్యేక కౌంటర్ ప్రారంభం
ప్రజాశక్తి-విజయవాడ అర్బన్ : రాష్ట్రం నుండి విచ్చల విడిగా సాగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక ప్రకటన చేశారు. విజయవాడలో బియ్యం, కందిపప్పును తక్కువ ధరకు విక్రయించే ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించారు. ఎపిఐఐసి కాలనీ రైతు బజార్లో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడిన ఆయన రేషన్ బియ్యం అక్రమ తరలింపులో రేషన్ బియ్యం అక్రమ తరలింపులో ఐదుగురు ఐపిఎస్ అధికారుల పాత్ర ఉందని తెలిపారు. పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టించేవారె ఎంత పెద్దవారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడలో 43,249 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం సీజ్ చేశామని తెలిపారు. దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.. గత ప్రభుత్వం రైతులకు రూ. 1,600 కోట్లు బకాయిపెట్టి వెళ్లిందని, తమ ప్రభుత్వం ఇటీవల రూ.1000 కోట్లు చెల్లించిందని, మిగిలిన రూ.600 కోట్లను త్వరలోనే చెల్లిస్తామని తెలిపారు. ధరల స్థిరీకరణపై రిటైల్ వర్తకులతో మంత్రి సమీక్షించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 284 ప్రత్యేక కౌంటర్లు
అంతకుముందు ప్రత్యేక కౌంటర్ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్యులకు సరసమైన ధరల్లో నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇందులో భాగంగా బియ్యం, కందిపప్పును అందించేందుకు రైతు బజార్లలో 284 ప్రత్యేక కౌంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కిలో కందిపప్పు రూ.160, కిలో బియ్యం స్టీమ్డ్ బిపిటి రకం రూ.49కు, బిపిటి రా రైస్ రకం రూ.48లకుఅందించనున్నట్లు తెలిపారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్రమంతా ఒకే ధర అమలు కావాలనే ఉద్దేశంతో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక కౌంటర్ల ద్వారా త్వరలో చక్కెర, చిరుధాన్యాలు వంటివి కూడా అందిస్తామని తెలిపారు.