సమసమాజ స్థాపన ఎర్రజెండాతోనే సాధ్యం

May 19,2024 23:32 #cpm, #cpm baburao, #V.Srinivas rao
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
  •  విజయవాడలో మానికొండ సుబ్బారావు గ్రంథాలయం, తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళావేదిక ప్రారంభం

ప్రజాశక్తి – విజయవాడ : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ముద్దుబిడ్డ పుచ్చలపల్లి సుందరయ్య కలలు కన్న సమ సమాజ నిర్మాణం సిపిఎం, ఎర్రజెండాతోనే సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. విజయవాడ కృష్ణలంక భ్రమరాంభపురంలో పునర్నిర్మాణం జరిగిన మానికొండ సుబ్బారావు గ్రంథాలయాన్ని వి. శ్రీనివాసరావు, తుర్లపాటి రామయ్య సాంస్కృతిక కళావేదికను విజయవాడ నగర పాలక సంస్థ స్థాయీ సంఘం మాజీ చైర్మన్‌ చిగురుపాటి బాబూరావు ఆదివారం ప్రారంభించారు. ముందుగా సుందరయ్య చిత్రపటానికి మాజీ కార్పొరేటర్‌ దోనేపూడి కాశీనాధ్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మానికొండ సుబ్బారావు గ్రంథాలయం కమిటీ కన్వీనర్‌ బత్తుల చిన్నారావు అధ్యక్షతన జరిగిన సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. అమెరికాకు కమ్యూనిజం ఓ భూతంలా ఆవరించిందని, సోవియట్‌ యూనియన్‌ పతనమైన సమయంలో కమ్యూనిజాన్ని పాతాళానికి తొక్కేయొచ్చని అమెరికాలాంటి పెట్టుబడిదారీ దేశాలు సంబరపడ్డాయని, కానీ అది ఎంతో కాలం నిలబడలేదని అన్నారు. నేడు సోషలిస్టు దేశం చైనా అన్ని రంగాల్లో పురోగమిస్తూ అమెరికాను ఢ అంటే ఢ అనే స్థితికి చేరిందన్నారు. పెట్టుబడిదారీ దేశాల్లో జరుగుతున్న పోరాటాలు, మన దేశంలో రైతాంగ ఉద్యమాలు, రాష్ట్రంలో విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు మూడేళ్ల నుండి కార్మికులు, ఉద్యోగులు జరుపుతున్న ఉద్యమం, కృష్ణపట్నం పోర్టును అదానీకి అప్పగించొద్దని నెల రోజులు పాటు కార్మికులు జరిపిన పోరాటాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గత పదేళ్ల బిజెపి- మోడీ పాలనలో దేశం అన్ని రకాలుగా నష్టపోయిందన్నారు. ఎన్నికల్లో లబ్ధిపొందాలని మతాన్ని, చివరికి అయోధ్య రాముడిని కూడా రాజకీయాల్లోకి లాగి ప్రధాని మోడీ అత్యంత నీచమైన రాజకీయాలు నడుపుతున్నారని విమర్శించారు. రైతులకు అత్యంత నష్టదాయకమైన, ప్రమాదకరమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను మొట్టమొదట వ్యతిరేకించింది, నిరసనలు తెలిపింది సిపిఎం మాత్రమేనన్నారు. మోడీ సంస్కరణల నేపధ్యంలో నీతి ఆయోగ్‌ చేసిన సూచనల మేరకు ఈ యాక్ట్‌ను రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు. దానిని అసెంబ్లీలో టిడిపి బలపరిచిందని, కానీ ఓట్ల రాజకీయాల కోసం ఈ యాక్ట్‌పై బిజెపి, టిడిపి, వైసిపి నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారని అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో వామపక్షాల ఒత్తిడి మేరకు మహత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, అటవీ సంరక్షణ చట్టం, విద్యాహక్కు చట్టం ఇలా అనేక ప్రజోపయోగ చట్టాలు అమలులోకి వచ్చాయన్నారు. కానీ వాటన్నింటినీ కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని విమర్శించారు.
బాబూరావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేవిధంగా కోట్లాది రూపాయలు వెచ్చించి బిజెపి, వైసిపి, టిడిపిలు ఓట్లు కొనుగోలు చేశాయని విమర్శించారు. ఇటువంటి కార్పొరేట్‌, ధన రాజకీయాలకు వ్యతిరేకంగా నీతి వంతమైన రాజకీయాల కోసం ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాశీనాధ్‌ మాట్లాడుతూ.. ప్రజాసమస్యల పరిష్కార వేదికగా ఈ భవనం నిలవాలని ఆకాంక్షించారు. డివైఎఫ్‌ఐ ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు పుప్పాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️