ETV Senior Journalist – ఈటీవీ సీనియర్‌ జర్నలిస్టు ఆదినారాయణ మృతి – ప్రముఖుల సంతాపం

అమరావతి : సీనియర్‌ జర్నలిస్ట్‌, ఈటీవీ హైదరాబాద్‌ బ్యూరో చీఫ్‌ టి.ఆదినారాయణ మృతి చెందారు. అపార్ట్‌మెంట్‌పై వాకింగ్‌ చేస్తూ ప్రమాదవశాత్తు జారిపడటంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఆదినారాయణ తుదిశ్వాస విడిచారు. ఆయన మఅతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఆదినారాయణ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కష్టపడి పనిచేశారన్నారు. నిజాయతీపరుడైన జర్నలిస్ట్‌గా సమాజంలో మార్పునకు ఎల్లప్పుడూ కృషి చేశారని కొనియాడారు. ఆదినారాయణ కుటుంబసభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదినారాయణ అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించిందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదినారాయణ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

నారాయణ మృతి పట్ల సంతాపం తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌… వర్తమాన రాజకీయాలు, ప్రజా సమస్యలపై ఎంతో అవగాహన ఉన్న జర్నలిస్ట్‌ నారాయణ అని కొనియాడారు. ఇటీవలి కాలంలో అనారోగ్యానికి గురైన ఆయన కోలుకుంటారని ఆశించానని, ఆయన అనారోగ్యం నుంచి కోలుకునేలోపే మరణ వార్త వినడం చాలా బాధాకరమన్నారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నారాయణ హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. బాధాతప్త హృదయంతో ఆయనకు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. రెండున్నర దశాబ్దాలుగా ఈటీవీలో పని చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కఅషి చేసిన నిబద్ధత గల జర్నలిస్టును కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆదినారాయణ మఅతి పట్ల మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌ రావు సంతాపం తెలిపారు. చిన్న వయస్సులోనే ఆయన మరణించడం చాలా బాధాకరమని కేటీఆర్‌ అన్నారు. ఆయన అకాల మరణం చాలా బాధించిందని హరీశ్‌ రావు తెలిపారు. ఆదినారాయణ మరణం పట్ల మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్‌, తుమ్మల సంతాపం ప్రకటించారు. టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ సైతం సంతాపం తెలిపారు.

➡️