అన్నీ నోటి మాటలే !

  • రాతపూర్వకంగా హామీ ఇవ్వబోమన్న ప్రభుత్వం
  • ఉద్యోగ సంఘాలపై ఆగ్రహం
  • బకాయిల చెల్లింపుఇప్పుడే కాదు
  • ఐఆర్‌ కాదు.. జులైలో పిఆర్‌సి ఇస్తామన్న సర్కారు
  • 27న చలో విజయవాడ యథాతథం : జెఎసి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్రప్రభుత్వ వైఖరి ఏమాత్రం మారలేదు. ఒక్క సమస్యను కూడా తక్షణమే పరిష్కరించడానికి సిద్దపడకపోగా, నోటి మాటలతో సరిపెట్టడానికి చూసింది. ఆ హామీలనైనా రాతపూర్వకంగా ఇవ్వండన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని శుక్రవారం జరిగిన చర్చల్లో పాల్గొన్న ప్రభుత్వ ప్రతినిధులు తిరస్కరించారు. పైగా తాము హామీ ఇస్తూ ఉంటే రాతపూర్వకంగా ఎలా అడుగుతారని ఉద్యోగ సంఘాల నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సమస్య గురించి ప్రస్తావించినా ఎన్నికల తరువాత అధికారంలోకి తిరిగి వస్తాం, అప్పుడు పరిష్కరిస్తాం అన్న ధోరణినే ప్రభుత్వ ప్రతినిధులు అనుసరించారు. ఎన్నికలలోగా మధ్యంతర భృతి ఇవ్వాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘మధ్యంతర భృతి ఇవ్వడం మా విధానం కాదు. ఒకేసారి పిఆర్‌సి ఇస్తాం. అదికూడా ఎన్నికలైన తరువాత మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఆ వెంటనే జులైలో పిఆర్‌సి ఇస్తాం’ అని చెప్పారు. ‘ఎన్నికల తరువాత కదా. ఈలోగా మధ్యంతర భృతి ఇవ్వండి’ అన్న ఉద్యోగుల విజ్ఞప్తిపై ‘ఒకేసారి పిఆర్‌సి ఇస్తామంటుంటే ఐఆర్‌ అడుగుతారేంటి?’ అని ప్రభుత్వ ప్రతినిధులు స్పందించారు. డిఎతో పాటు ఇతర బకాయిల చెల్లింపు కూడా ఇప్పుడే కాదని తేల్చి చెప్పేశారు. తమ ఆందోళనలు కొనసాగుతాయని, 27వ తేది చలో విజయవాడ యథాతథంగా జరుగుతుందని ఉద్యోగ సంఘాల నేతలు సమావేశానంతరం ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో ప్రభుత్వం తరుపున మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎన్‌.చంద్రశేఖరరెడ్డి, సర్వీసెస్‌ కార్యదర్శి పోలా భాస్కర్‌, ఆర్థికశాఖ అధికారి ఆదినారాయణ హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల నుండి బండి శ్రీనివాసరావు, వెంకట్రామిరెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వరర్లు, సూర్యనారాయణ, యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ఎస్‌టియు నాయకులు సాయిశ్రీనివాస్‌, ఎపిటిఎఫ్‌ నాయకులు హృదయరాజు, పలు సంఘాల నాయకులు బాలాజీ, శ్రీనివాస్‌ హాజరయ్యారు. చర్చల సందర్బంగా డిఎపిసి 2003లో ఎంపికై 2004లో అపాయింట్‌మెంట్‌ పొందిన వారికి ఓపిఎస్‌ వర్తింపు, పెన్షనర్లకు అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్‌ రిస్టోర్‌, పిఆర్‌సి అరియర్స్‌ బకాయిల చెల్లింపు తదితర అంశాలను సంఘాలు ప్రభుత్వం ముందుంచాయి. జులై నాటికి పిఆర్‌సి : మంత్రి బొత్స ప్రస్తుతం ఐఆర్‌ ఇవ్వలేమని, జులై నాటికి నేరుగా పిఆర్‌సి అమలు చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ చర్చల్లో పాల్గొన్న ఇతర ప్రభుత్వ ప్రతినిధులు ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. 2003 డిఎస్‌సి వారికి పాత పెన్షన్‌ ప్రకారం చెల్లించడానికి సానుకూలమని చెబుతూనే దానిపై చర్చించుకుని నిర్ణయం చెబుతామని అన్నారు. మెడికల్‌ క్లెయిములు రూ.80 కోట్లు చెల్లించామని, టిఏ బకాయిలు, సిపిఎస్‌ బకాయిలు కూడా చెల్లించినట్లు తెలిపారు. అడిషనల్‌ క్వాంటమ్‌ పెన్షన్‌ 70, 75 సంవత్సరాలకు ప్రస్తుతం చెల్లిస్తున్న 7, 12 శాతానికి బదులు 10, 15 శాతంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలపై సిఎస్‌తో చర్చిస్తామని, కారుణ్య నియామకాల సమస్యను త్వరలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కాంట్రాకు ఉద్యోగులను దశలవారీగా రెగ్యులర్‌ చేస్తామన్నారు. బకాయిలకు సంబంధించి మార్చిలో రూ.5,500 కోట్లు, ఏప్రిల్‌ మే నెలల్లో రూ.6,000 కోట్లు ఇస్తామని తెలిపారు. అయితే, వీటిలో ఏ ఒక్క హామీని రాతపూర్వకంగా ఇవ్వడానికి ప్రభుత్వ ప్రతినిధులు అంగీకరించలేదు. ఆందోళనలు కొనసాగుతాయి : బండి శ్రీనివాసరావు ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇచ్చే వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని ఎపి ఎన్‌జిఓ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు తెలిపారు. మంత్రులు చెప్పిందే చెబుతున్నారని పేర్కొన్నారు. అన్నీ చేస్తామంటున్నారు తప్ప స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 27వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం యథావిధిగా జరుగతుందని అన్నారు. పిఆర్‌సి సమయంలో ఐఆర్‌ ఇవ్వడం ఆనవాయితీ అని అది కూడా లేదని చెబుతున్నారని అన్నారు. ఏది అడిగినా తాము మరలా అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తామంటున్నారని, ఇదేమిటో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రిటైరైన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ఐఆర్‌ ఇవ్వబోమంటున్నారు : బొప్పరాజు పిఆర్‌సి సందర్భంలో గత సంప్రదాయాల ప్రకారం ఇస్తున్న ఐఆర్‌ను ఇచ్చేది లేదని అంటున్నారని ఎపిజెఎసి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. రిటైర్‌అయిన పెన్షనర్లకు గత పిఆర్‌సి చర్చల సందర్భంగా అడిషనల్‌ క్వాంటమ్‌ ఆఫ్‌ పెన్షన్‌ తగ్గించారని, దాన్ని పునరుద్ధరించాలని కోరినట్లు పేర్కొన్నారు. రూ.14 వేల కోట్ల ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలని కోరారు. వీటిపై చర్చించుకుని వచ్చి చెబుతామన్నారని తెలిపారు. సానుకూలత వ్యక్తం చేశారు : వెంకట్రామిరెడ్డి ఉద్యోగ సంఘాల చెప్పిన అంశాలపై ప్రభుత్వ ప్రతినిధులు సానుకూల స్పందన వ్యక్తం చేశారని సెక్రటేరియట్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నాయకులు కె.వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఆర్థికేతర అంశాలపై త్వరలోనే నిర్ణయం వెలువరిస్తామన్నారని, ఆర్ధికపరమైన అంశాలపై చర్చిస్తామన్నారని వివరించారు. జులైతో మంచి పిఆర్‌సి ఇస్తామన్నారని పేర్కొన్నారు.

➡️