వైసిపి అద్దంకి మాజీ ఇన్‌ఛార్జి క్వారీలో తనిఖీ

ప్రజాశక్తి-బల్లికురవ రూరల్‌ :  వైసిపి అద్దంకి నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి బాచిన కృష్ణ చైతన్యకు సంబంధించిన గ్రానైట్‌ క్వారీలో మైనింగ్‌ అధికారులు బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. క్వారీకి అనుమతి ఉందా? లేదా? అనుమతి ఉంటే అనుమతులకు మించి రాయి తీస్తున్నారా? లేక చట్టాన్ని ఉల్లంఘించి అనుమతికి మించి రాళ్లు తీస్తున్నారా? అనే విషయంపై అధికారులు ఆరా తీశారు. పలు రికార్డులు తనిఖీ చేశారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు కృష్ణచైతన్య అనుచరులు విమర్శించారు. రెండు నెలల క్రితం వైసిపి ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి కృష్ణ చైతన్యను పార్టీ అధిష్టానం తప్పించింది. ఆయన స్థానంలో పానెం హనీమిరెడ్డిని నియమించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను ఎవరికి వారే పోటా పోటీగా నిర్వహించారు. ఈ క్రమంలో ఇరువురునీ సిఎంఒ కార్యాలయానికి పిలిపించారు. కృష్ణ చైతన్య పార్టీ మారుతున్నట్లు గత రెండు, మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బల్లికురవ మండలంలోని మల్లాయపాలెం గ్రామంలో ఉన్న కృష్ణచైతన్యకు సంబంధించిన క్వారీలో మైనింగ్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారని ఆయన అనుచరులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

➡️