దెబ్బతింటోన్న పోలీసుల ఆత్మస్థైర్యం :మాజీ మంత్రి మేరుగ నాగార్జున

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నారా వారి రెడ్‌బుక్‌ రాజ్యాంగంతో పోలీసుల విధులకు అడ్డుపడుతూ, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టిడిపి అరాచకాలకు పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు అని పోలీసులు కేక్‌ కట్‌ చేయటం ఏమిటని ప్రశ్నించారు. అసలు ఆమెకు ఏ హోదా వుందని పోలీసులు అలా వ్యవహరించారని ప్రశ్నించారు. అలాగే తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్‌ రెడ్డి వీడియోకాల్‌లో ఒక సిఐతో బహిరంగంగా క్షమాపణలు చెప్పించుకున్నారని అన్నారు. సీతారామపురంలో వైసిపి నేత సుబ్బరాయుడు హత్య జరగనుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. కడప జిల్లాలో మంత్రి భార్య.. పోలీసులను బెదిరించారని, నారా లోకేష్‌ భార్య, కొడుక్కి పోలీసులు గౌరవ వందనం చేశారని అన్నారు. నిజాయతీగా పనిచేసిన ఐపిఎస్‌ అధికారులకు బాధ్యతలు లేకుండా పక్కన కూర్చోబెట్టారన్నారు.
మైలవరం వైసిపి ఇన్‌ఛార్జిగా జోగి రమేష్‌
మైలవరం వైసిపి ఇన్‌ఛార్జిగా మాజీ మంత్రి జోగి రమేష్‌ నియమితులయ్యారు. అలాగే పెనమలూరు నియోజకవర్గానికి దేవభక్తుని చక్రవర్తిని ఇన్‌ఛార్జిగా నియమితులయ్యారు. ఈ మేరకు వైసిపి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

➡️