హత్యకేసులో మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు అరెస్ట్‌

ప్రజాశక్తి – అమలాపురం, రామచంద్రపురం(కోనసీమ జిల్లా) : డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో రెండున్నరేళ్ల క్రితం హత్యకు గురైన వలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని మధురైలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై మన రాష్ట్రాన్కి తరలించారు. శ్రీకాంత్‌ అరెస్ట్‌ వ్యవహారంపై ఎపి పోలీసులు ఇంకా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. వైసిపి సర్కారు హయాంలో ఈ కేసును విచారణ చేయకుండానే మూసేశారు. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసుపై విచారణ వేగవంతమైంది. కోనసీమ ప్రాంతానికి అంబేద్కర్‌ పేరు పెట్టిన సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. అదే సమయంలో అయినవిల్లికి చెందిన వలంటీరు దుర్గాప్రసాద్‌ 2022 జూన్‌ 6న హత్యకు గురయ్యారు. ఈ కేసుకు సంబంధించి ఉప్పలగుప్తం మండలానికి చెందిన నిందితుడు, వైసిపి సోషల్‌ మీడియా కన్వీనర్‌, మృతుడికి స్నేహితుడైన రమేష్‌ను పోలీసులు విచారించారు. విచారణలో మరో నలుగురు నిందితులతో పాటు శ్రీకాంత్‌ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

➡️