మాజీ ఎంఎల్‌ఎ వర్మపై జనసైనికుల దాడి

Jun 8,2024 08:44 #Attacked, #Ex-MLA Verma, #JanaSena

ప్రజాశక్తి- పిఠాపురం (కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో టిడిపి మాజీ ఎంఎల్‌ఎ వర్మపై జనసైనికులు దాడి చేశారు. గ్రామస్తులు, టిడిపి నాయకులు తెలిపిన వివరాలు ప్రకారం… వన్నెపూడి వైసిపి సర్పంచ్‌ కందా సుబ్రహ్మణ్యం ఇంటికి మాజీ ఎంఎల్‌ఎ వర్మ శుక్రవారం వెళ్లారు. తిరిగి పయనమవుతున్న సమయంలో జనసైనికులు మూకుమ్మడిగా ఇటుకలు, సీసాలు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పలువురు టిడిపి కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. వర్మ కారు అద్దాలు పగిలాయి. టిడిపి కార్యకర్తలు వలయంగా ఏర్పడి వర్మను అక్కడి నుంచి తప్పించారు. అనంతరం గొల్లప్రోలులోని తన గెస్ట్‌ హౌస్‌ వర్మ చేరుకున్నారు. దాడి విషయం తెలుసుకున్న పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు, వర్మ అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో వర్మ మాట్లాడుతూ ఎన్నికల పూర్తి అయిన అనంతరం ఎన్నికల్లో పాల్గొన్న కార్యకర్తలను, సహకరించిన వారిని కలవడం తన బాధ్యతన్నారు. అందులో భాగంగా ఎన్నికల్లో సహకరించిన సర్పంచ్‌ కందా సుబ్రమణ్యంను కలిశానన్నారు. ఇది సహించని ఇటీవల టిడిపి నుంచి జనసేనలో కలిసిన నాయకులు, కార్తకర్తలు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. టిడిపి నాయకులు, కార్యకర్తల సహకారంతో తప్పించుకున్నానని తెలిపారు. దాడికి నిరసనగా టిడిపి నాయకులు గొల్లప్రోలు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు.

➡️