వైసిపి ఎమ్మెల్యేకు టిడిపి మాజీ ఎమ్మెల్యే సవాల్‌ – రామవరంలో ఉద్రిక్తత

అనపర్తి (తూర్పు గోదావరి) : టిడిపి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. వైసిపి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అవినీతి, అక్రమాలపై ఆయన నివాసానికే వెళ్లి చర్చిస్తానని.. 109 అంశాలపై చర్చకు సిద్ధమా ? అంటూ… రామకృష్ణా రెడ్డి గురువారం సూర్యనారాయణరెడ్డికి సవాల్‌ విసిరారు. 175 మంది ఎమ్మెల్యేల్లో తాను ఒక్కడినే అవినీతి చేయలేదంటున్న సూర్యనారాయణరెడ్డి.. చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం రామవరం నుంచి అనపర్తిలోని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇంటికి రామకృష్ణా రెడ్డి బయలుదేరారు. ఈ క్రమంలో … పోలీసులు భారీగా మోహరించి రామకృష్ణారెడ్డిని రామవరంలో అడ్డుకున్నారు. అతడి వాహనాన్ని ఆపేశారు. అప్పటికి పెద్ద ఎత్తున టిడిపి కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు అడ్డుగా పెట్టిన బారికేడ్లను దాటి ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులు-టిడిపి శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ … పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని.. తనతో మాట్లాడతామని వచ్చి నిర్బంధించేందుకు ప్రయత్నించారని నిప్పులు చెరిగారు. హైస్కూల్‌ ఆస్తిని కబ్జా చేశారని.. అయినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వైసిపి నేతలు ఇళ్ల పట్టాల పేరుతో భూసేకరణ చేసి రూ.15 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.

➡️