రెండో పాయింట్‌ వద్ద తవ్వకాలు

Mar 10,2025 22:50 #Acident, #SLBC Tunnel, #workers death
  • గురుప్రీత్‌ సింగ్‌ కుటుంబసభ్యులకు రూ.25 లక్షల సహాయం
  • నేటి నుంచి రంగంలోకి రోబోలు : కలెక్టర్‌

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : క్యాడవర్‌ డాగ్స్‌ గుర్తించిన రెండో పాయింట్‌ వద్ద సోమవారం తవ్వకాలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదమూ జరగకుండా రెస్క్యూ సిబ్బంది జాగ్రత్తగా తవ్వకాలు జరుపుతున్నాయి. గురుప్రీత్‌సింగ్‌ మృతదేహం పక్కనే మరో పాయింట్‌ దగ్గర తవ్వకాలు చేపట్టారు. టిబిఎం మిషన్‌ తీస్తే… పై భాగం పడిపోయి రెస్క్యూ టీం మొత్తం ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా టిబిఎం మిషన్‌ను కట్‌ చేస్తూ.. సిబ్బంది అన్ని జాగ్రతలూ తీసుకుంటోంది. సోమవారం సాయంత్రానికి సహాయక చర్యలు ఓ కొలిక్కి రాకపోతే మంగళవారం నుంచి రోబోల ద్వారా తవ్వకాలు మొదలు పెడతామని కలెక్టర్‌ చెప్పారు. చనిపోయిన గురుప్రీత్‌ సింగ్‌కు సంతాపం ప్రకటించి వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఉన్నతాధికారులు రూ.25 లక్షలు సహాయం అందజేశారు. టన్నెల్‌ ఆఫీసులో డిజాస్టర్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ బాదావత్‌ సంతోష్‌, జిల్లా ఎస్‌పి వైభవ్‌ గైక్వాడ్‌ రఘునాథ్‌, ఆర్మీ, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, సింగరేణి మైన్స్‌ రెస్క్యూ టీం, ర్యాట్‌ మైనర్స్‌, దక్షిణ మధ్య రైల్వే, కేరళకు చెందిన క్యాడవర్‌ డాగ్స్‌ స్క్వాడ్‌, సహాయక చర్యల్లో పాల్గొంటున్న విభాగాల అధికారులు హాజరయ్యారు. ఆదివారం జరిగిన సహాయక చర్యలను సమీక్షించి, పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన గురుప్రీత్‌ సింగ్‌ మృతదేహాన్ని వెలికి తీసిన సహాయక బృందాలను అభినందించారు. ఇదే స్ఫూర్తితో సహాయక చర్యలను మరింత వేగంగా, సమర్థవంతంగా కొనసాగించాలని సూచించారు.

➡️