ఆగని వైరస్‌ ఉధృతి

  • కొనసాగుతున్న కోళ్ల మృత్యువాత

ప్రజాశక్తి – తణుకు రూరల్‌ : రెండు నెలలుగా అంతుచిక్కని వైరస్‌ ప్రభావంతో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో తొలుత ఇది నాటుకోళ్లకు వ్యాపించి, ఆపై బ్రాయిలర్‌, తాజాగా లేయర్‌ కోళ్లలో విజృంభిస్తోంది. సాధారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్లకు ఎప్పటికప్పుడు వ్యాక్సిన్‌ వేస్తూ, పరిసరాలను డిసిన్ఫెక్ట్‌ మందులతో స్ప్రే చేస్తూ శుభ్రం చేస్తారు. అయినప్పటికీ కోళ్లు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. ఈ వైరస్‌ ప్రారంభం నుంచి రోజుకు ఐదు వేల కోళ్లు చనిపోతున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారుగా 400 కోళ్ల ఫారాలు ఉండగా వాటిలో లేయర్‌ కోళ్లు 2.50 కోట్ల మేర ఉన్నాయి. ఇప్పటివరకు లక్షల్లో కోళ్లు మరణించినట్లు నిర్వహకులు చెబుతున్నారు.
ఒక్కో కోడి ధర గుడ్డు పెట్టే సమయానికి రూ.300కు పైగా ఉంటుందని 18 వారాల నుంచి వంద వారాల వరకు గుడ్లు పెడుతుందని రైతులు చెబుతున్నారు. వైరస్‌ ప్రభావం కన్పించిన ఐదు గంటల్లోనే కోళ్లు మృతి చెందడంతో రైతులకు దిక్కు తోచడం లేదు. వాతావరణ పరిస్థితులు ఏమైనా మారితే వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అప్పటి వరకు కోళ్లకు యాంటీబయోటిక్‌ మందులు వాడాలని, పరిసరాలను శుభ్రం చేసుకోవాలని, కోడి రెట్టలపై ఫార్మల్‌ ఇన్‌ స్ప్రే చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. కోళ్లకు ఇచ్చే దాణాలో నిరోధక శక్తి పెరిగే విధంగా ప్రోటీన్స్‌, అమినోయాసిడ్స్‌ అయిన లైజిన్‌, మిధియోనైన్‌, ఆర్బినైన్‌, వాలైన్‌ వంటి వాటిని 20 శాతం వరకు అందించాలని, విటమిన్‌-ఇ, సెలీనియం వంటి మందులు కూడా కోళ్లలో రోగ నిరోధక శక్తిని పెంచుతుందని సూచించారు. చనిపోయిన కోళ్లను ఒక క్రమ పద్ధతిలో పూడ్చి పెట్టాలని, లేదా కాల్చివేయాలని, కోడిగుడ్లు, కోడి మాంసం వినియోగం వల్ల ఎటువంటి హానీ ఉండదని తణుకు మండల పశువైద్యాధికారి కె.శంకర్‌ భావన్నారాయణ తెలిపారు. ప్రస్తుతం పగటిపూట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో వైరస్‌ వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టిందని, మరణాల సంఖ్య క్రమంగా తగ్గుతుందని పౌల్ట్రీ రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

➡️