ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపుపై తాత్కాలికంగా కేంద్రం వెనక్కి!

visakha steel plant protest in vizag

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఉక్కు కాంట్రాక్టు కార్మికులను తొలగించాలన్న నిర్ణయం నుంచి కేంద్రం ఆదేశాలతో స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. దీంతో, కార్మికులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ప్రమాదం పొంచే ఉందంటూ స్టీల్‌ప్లాంట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నెల 27 సాయంత్రం విశాఖ ఉక్కు యాజమాన్యం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో సుమారు నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించాలని, వారి గేట్‌పాస్‌లను వెనక్కి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, కార్మికులు తీవ్ర ఆందోళన చెందారు. శుక్రవారం అర్ధరాత్రి నాటికి విశాఖ జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ సహా ఉన్నతాధికారులంతా ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపు విషయమై ఒక్కసారిగా ఉలిక్కిపడ్డట్టు సమాచారం. స్టీల్‌ప్లాంట్‌పై ఒకేసారి ఇలాంటి నిర్ణయం చేస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయని, కార్మికవర్గం మూడేళ్లుగా చేస్తున్న పోరాట మరింత ఉధృతమవుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులతో ఫోన్‌లో సంప్రదింపులు జరిపి ఇప్పటికే రాష్ట్రంలో పరిస్థితులు అట్టుడుకుతున్నాయని, ఉక్కు కార్మికుల ఆందోళనలు రాష్ట్రమంతటా చెలరేగే అవకాశాలున్నందున నిర్ణయాన్ని వాయిదా వేయాలని కోరినట్టు సమాచారం. దీంతో, స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో శనివారం ఎవరి గేట్‌ పాస్‌లనూ వెనక్కి తీసుకోకపోవడంతో కార్మికులంతా ఎప్పటిలాగానే విధులకు హాజరయ్యారు. ఈ తాత్కాలిక ఉపశమనం కేవలం 15 రోజులపాటే ఉంటుందన్న చర్చ ఉక్కు కర్మాగారంలో కార్మికుల మధ్య నడుస్తోంది. మళ్లీ తొలగింపు నిర్ణయాన్ని యాజమాన్యం తిరగదోడి కార్మికులను వెనక్కి పంపించే అవకాశాలు లేకపోలేదని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మభ్యపెట్టే ప్రకటనలు
కేంద్రంలోని బిజెపి సర్కారు, రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం కార్మికులను మభ్య పెట్టే ప్రకటనలను చేస్తుండడంపై పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెయిల్‌లో విలీన ప్రక్రియ జరిగిపోయినట్టు, కేంద్రం రూ.2,500 కోట్ల రుణం ఇచ్చేస్తున్నట్టు, ప్రైవేటీకరణ ఆగిపోయినట్టు వార్తలు, ప్రచారాలు వస్తుండడంపై మండిపడుతున్నారు. ప్రైవేటీకరణ ప్రక్రియ ఆగిపోయిందని చెబుతున్న దానిలో వాన్తవం లేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్‌ తెలిపారు. ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోయినట్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన వరకూ పోరాటం కొనసాగుతుందన్నారు.

➡️